సమన్వయంతో ఎన్నికల నిర్వహణ : తెలుగు రాష్ట్రాల నిర్ణయం

Apr 16,2024 01:05 #ap election

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించాయి. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివావాలయంలో అంతర్‌ రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి, శాంతికుమారిల అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సిఎస్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు తెలంగాణతో కలిసి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. ఎపిలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిరోధానికి ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరిటి చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ సత్ఫాలితాలిచ్చిందని తెలిపారు. ఎపితో ఉన్న వివిధ రాష్ట్ర సరిహద్దుల్లో పలు శాఖల ద్వారా 129కు పైగా ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులను పెట్టామన్నారు. తెలంగాణ రాష్ట్ర సిఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇదే రకమైన వాతావరణాన్ని పోలింగ్‌ పూర్తయ్యే వరకు మరింత పకడ్బంధీగా కొనసాగేలా చేసాలా కృషి చేస్తామని తెలిపారు. . తెలంగాణ డిజిపి రవిగుప్తా, ఎడిజిపిలు శివధర్‌ రెడ్డి, మహేష్‌ భగవత్‌, ఎపి అడిషనల్‌ డిజి డాక్టర్‌ శంకబత్ర బాగ్చి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. రజత్‌ భార్గవ, తదితరులు పాల్గొన్నారు.

➡️