జగన్‌ లండన్‌కు పారిపోతారు – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

May 9,2024 21:49 #achennaidu, #press meet

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పోలింగ్‌ ముగిసిన సాయంత్రానికే జగన్‌ లండన్‌ పారిపోతారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ అండతో రెచ్చిపోతున్న వైసిపి గూండాల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం విలేకరి రమేష్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం దిగిపోయే వరకు ప్రజలపై, మీడియాపై దాడులు, దౌర్జన్యాలకు వైసిపి మూకలు పాల్పడుతునే ఉన్నాయని అన్నారు. ఓటమి భయంతో మీడియా ప్రతినిధులపై జగన్‌ ఫ్యాక్షన్‌ దాడులకు బరితెగిస్తున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మరో ప్రకటనలో తెలిపారు. మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.
రాజధాని అమరావతిని సిఎం జగన్‌ విధ్వంసం చేశారని టిడిపి- జనసేన- బిజెపి నేతలు విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట ఆడి మూడు ప్రాంతాల ప్రజలను మోసం చేశారని టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య, గురజాల మాల్యాద్రి, శివశంకర్‌, అజరు వర్మ, సామినేని యామిని, లంక దినకర్‌ అన్నారు.
బిజెపికి వైసిపి ఇప్పటికీ తొత్తుగానే వ్యవహరిస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్‌ విమర్శించారు. బిజెపిని విమర్శించే ధైర్యం జగన్‌కు లేదన్నారు.

➡️