జగన్‌ రాయలసీమకు చేసిందేమీలేదు

May 11,2024 16:59 #cbn

నంద్యాలలో మాజీ సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-నంద్యాల
రాయలసీమకు సిఎంగా వైఎస్‌ జగన్‌ చేసిందేమీలేదని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గని ప్రసంగించారు. ‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి ఇంటికి ఐకాన్‌ స్టార్‌, హీరో అల్లు అర్జున్‌ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు” అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్‌ 9వ తేదీ గుర్తుకు వస్తోంది. రాత్రి మీటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని బస చేశాను. నిద్ర పోతున్నప్పుడు పోలీసులు దొంగల్లా వచ్చారు. నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నేను మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసులో అరెస్ట్‌ చేస్తున్నారని అడిగాను. ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వమని అడిగాను. దారిలో ఇస్తామని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్‌, మాజీ ముఖ్యమంత్రిని నన్నే అక్రమంగా అరెస్టు చేశారు. ఇక సామాన్యుల ఓ లెక్కా. జైల్లో నన్ను చంపేస్తానంటూ భయపెట్టారు. నన్ను చంపేస్తానంటే ఎవరి మెడకు వాళ్ళు ఉరేసుకుని చావాల్సి వస్తుంది జాగ్రత్త. నేను ఎప్పుడు ప్రాణానికి భయపడలేదు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ మెయిన్‌ టెన్‌ చేశాను. తిరుపతిలో నాపై క్లైమెర్‌ మెన్స్‌తో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి కాపాడారు” అని చంద్రబాబు అన్నారు.

➡️