హామీల ఉల్లంఘనల్లో జగన్‌ నేర్పరి

  • 99 శాతం అమలు చేశామనడం బూటకం
  • సొంత చెల్లితోపాటు ప్రజలనూ మోసగించారు
  • మూడు నెలల్లో ఎప్పుడైనా పింఛను తీసుకొనే వెసులుబాటు
  • సామాజిక న్యాయానికి వైసిపి తూట్లు-రా… కదలిరా సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి- గుంటూరు, రాజమహేంద్రవరం ప్రతినిధులు : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడంలో సిఎం జగన్‌ మంచి నేర్పరని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోనూ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరులోనూ ‘రా… కదలిరా పేరుతో సోమవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల వీడియోలను వడ్లమూడి సభలో ప్రదర్శించారు. వైసిపి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇస్తానని, వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేశానని, ప్రజలకు భారంగా ఉన్న విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తానని, ఏటా జాబ్‌ కేలండర్‌, డిఎస్‌సి నియామకాలు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రాజధాని అమరావతి అభివృద్ధి, 2021 జూన్‌ కల్లా పోలవరం పూర్తి, ప్రత్యేక హోదా, బిసి సబ్‌ప్లాన్‌, పంటలకు మద్దతు ధర, కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్ల నిధులు, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు, 2024 నాటికి మద్యనిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అని చెప్పిన హామీల వీడియోలు వీటిలో ఉన్నాయి. ఈ హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా, అమలు చేశానంటూ జగన్‌ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వాల్సి ఉండగా, సొంత చెల్లెలుకు ఆస్తి ఇవ్వకుండా జగన్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజలను వాగ్దానాలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి డబ్బులు అందిస్తామని, ఒక నెలలో పింఛను తీసుకోని వారు మూడు నెలల్లోపు ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. వైసిపిలో తిరుగుబాటు మొదలైందని, తాను గేట్లు తెరిస్తే ఆ పార్టీ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలోకి వస్తారని పేర్కొన్నారు. జగన్‌ క్యాబినెట్‌లో పది మంది మంత్రులకు సీట్లు మార్చారంటే వారంతా ఓడిపోతారని అంగీకరించనట్టేనని ఎద్దేవా చేశారు. 68 మంది ఎమ్మెల్యేలను మార్చారని, వారిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలే ఎక్కువగా ఉన్నారని వివరించారు. టిడిపి-జనసేన పొత్తు అనగానే వైసిపి నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. వైసిపిలో దళిత ఎమ్మెల్యేలపై దాడి చేస్తున్నారనే దానికి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు నిదర్శమని పేర్కొన్నారు. వైసిపి హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సామాజిక న్యాయం అంటూనే తన సామాజిక తరగతికి చెందిన సామంతులతో పాలన చేస్తున్నాడని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి అన్నారు. పదో తరగతి విద్యార్థి, బిసి బిడ్డ అమర్నాథ్‌ను హత్య చేసిన వారు బయట తిరగడమే సామాజిక న్యాయమా? దళిత యువకుడు శ్రీను జైల్లో, జగన్‌ బాబాయి వైఎస్‌.వివేకానంద హంతకులు బయట ఉండడమే సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు సర్వసాధారణమని, అయితే తన ఫొటో, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టి బూటు కాలితో తన్నించడం వంటి చర్యలకు పాల్పడే వారిని ఏమనాలి? ఇలాంటి చర్యలను నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో 72 శాతం పోలవరం పూర్తి చేస్తే దాన్ని జగన్‌ నాశనం చేశారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకూ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, వర్క్‌ ఫ్రమ్‌ హోంకు శ్రీకారం చుడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

➡️