అవ్వాతాత అంటూనే జగన్‌ మోసం : టిడిపి అధినేత చంద్రబాబు

  •  ఇంటివద్దకు పెన్షన్‌ ఇవ్వకపోవడం వైసిపి కుట్ర

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవ్వాతాత అంటూనే వృద్ధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒకటిన ఇంటివద్దకు తెచ్చి పెన్షన్‌ ఇవ్వకపోవడం వెనుక వైసిపి కుట్ర ఉందని అన్నారు. టిడిపి నేతలు, బూత్‌స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత 15 రోజుల్లోనే జగన్‌ రూ.13 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్‌ ఇవ్వలేకపోయి ఆ నెపాన్ని తమపై, ఎన్నికల సంఘంపై నెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. వలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగానే వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందన్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్‌ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదని పేర్కొన్నారు. వలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయనీయకూడదని టిడిపి ఎవరినీ కోరలేదని అన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్‌ విషయంలో వైసిపి ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్‌ ఇంటింటికీ వచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని, ఈ విషయాలు లబ్ధిదారులకు వివరించాలని చెప్పారు. జిల్లా నేతలు కలెక్టర్లు, మండల నేతలు తహశీల్దార్లను కలిసి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పాలని సూచించారు. జగన్‌ రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బినామీగా ఉన్న డ్రైవరుకు శింగనమలలో సీటు ఇచ్చారని తాను అన్న మాటలను డ్రైవరును అవమానపరిచినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెన్షన్‌ పంపిణీపై వైసిపి దుష్ప్రచారం : సిఎస్‌కు ఫిర్యాదు టిడిపి నేతలు ఫిర్యాదు

వలంటీర్ల ద్వారా పెన్షన్‌ పంపిణీ చేయొద్దన్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులపై వైసిపి నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని టిడిపి నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధికోసం తమ పార్టీతో పాటు, అధినేత చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సిఎస్‌ను సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. పెన్షన్‌ పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూసి అందించాలని కోరారు. సిఎస్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులను ఎన్నికల విధుల్లోంచి మినహాయించాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విడివిడిగా లేఖలు రాశారు.

ఎన్నికల సంఘానికి కూటమి నేతల ఫిర్యాదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాయకులు అనంతరం మీడియాతో చెప్పారు. తిరుపతి కలెక్టరు, పల్నాడు, నంద్యాల ఎస్‌పిలను తొలగించాలని కోరామని తెలిపారు. మీనాను కలిసిన వారిలో టిడిపి నాయకులు వర్ల రామయ్య, బిజెపి నేత షేక్‌ బాజీ, జనసేన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితరులు ఉన్నారు.

పాటల ఆల్బమ్‌ను ఆవిష్కరణ

టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘కదలరా తెలుగోడా కదలిరా’ అనే పాటల ఆల్బమ్‌ను టిడిపి నేతలు ఆవిష్కరించారు. ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాల కన్వీనర్‌ అట్లూరి నారాయణరావు రూపొందించిన ఈ ఆల్బమ్‌ను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్‌, వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, నాయకులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హాటల్‌లో ఆవిష్కరించారు.

➡️