జగన్‌ కేసుల విచారణ మూడు నెలలకు వాయిదా : హైకోర్టు

Dec 16,2023 08:24 #adjourned, #telangana high court

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరోమాజీ ఎంపి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ మూడు నెలలకు వాయిదా పడింది.జగన్‌ అక్రమాస్తుల కేసులపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో సిజె ధర్మాసనం విచారణ జరిపింది. దీనికి సంబంధించి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్‌ కేసులపై విచారణ పూర్తి చేయాలని పిటిషనర్‌ కోరారు. ఇప్పటికే 20 కేసుల్లో డిశ్చార్జ్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి జగన్‌, సిబిఐకి ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదు. నవంబరు ఎనిమిదిన విచారణ సందర్భంగా జగన్‌, సిబిఐకి నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటి వరకు నోటీసులు జారీ కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో సుమోటో పిల్‌గా ప్రజా ప్రతినిధుల కేసులను హైకోర్టు విచారిస్తోంది. సుమోటో పిల్‌తో కలిపి జగన్‌ కేసుల పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.

➡️