పులివెందులలో జగన్‌ హ్యాట్రిక్‌.. భారీగా తగ్గిన మెజార్టీ

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ / అమరావతి బ్యూరో : వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని సాధించిన జగన్‌ తన మెజార్టీ మాత్రం భారీగా తగ్గింది. ముఖ్యమంత్రి పీఠాన్ని రెండో సారి అధిష్టాంచాలనే పట్టుదలతో మూడో సారి బరిలోకి దిగారు. పులివెందుల నియోజకవర్గం వైఎస్‌ కుటుంబానికి కోటవంటిదని చెప్పవచ్చు. 2014లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన జగన్‌మోహర్‌రెడ్డి 75,243 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి సతీష్‌కుమార్‌రెడ్డిపై గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనపైనే 90110 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తాజా ఎన్నికల్లో జగన్‌తో టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పోటీపడ్డారు. ఈ సారి ఎలాగైనా లక్షపైచిలుకు మెజార్టీ సాధించాలనే పట్టుదలతో జగన్‌ ఉన్నారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పాత, కొత్త ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోరు సాగింది. ఏదేమైనా పులివెందుల్లో వైఎస్‌ జగన్‌ విజయం నల్లేరుపై నడకే అన్న చందంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 2019 కన్నా 28,423 ఓట్లు తగ్గాయి. 22 రౌండ్లలోనూ వైసిపి అభ్యర్థి వైఎస్‌ జగన్‌ ఆధిక్యం సాధించారు. ఆయనకు 1,16,315 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డికి 54,628 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ధ్రువకుమార్‌రెడ్డికి 10,083 ఓట్లు వచ్చాయి. రవీంద్రనాథ్‌రెడ్డిపై జగన్‌ 61,687 మెజార్టీతో గెలుపొందారు.

ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసిపి
వైసిపి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం పొందలేకపోయింది. 151 సీట్లతో ఐదేళ్లు పాలించిన ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 175 సీట్లున్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 1/10 వంతు సీట్లు అవసరం ఉంటుంది. అంటే కనీసం 17 లేదా 18 సీట్లు రావాల్సి ఉంటుంది.వైసిపికి అన్ని సీట్లు రాకపోవడంతో ఇప్పటి వరకూ సభానాయకుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పొందలేకపోయారు.

➡️