జగన్‌కు విలువలు, విశ్వసనీయ లేదు

May 10,2024 21:50 #press meet, #ys sharmila

– చెల్లెళ్లను దూషించడంలో చరిత్రలో నిలుస్తారు : వైఎస్‌ షర్మిల
ప్రజాశక్తి-కడప :ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి విలువలు, విశ్వసనీయత లేవని పిసిసి అధ్యక్షులు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం, మైదకూర్‌ మండలంలోని చేపడులో శుక్రవారం ఆమె ప్రచారం నిర్వహించారు. అనంతరం వైఎస్‌ఆర్‌ జిల్లా డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శు షర్మిల ఆమె మాట్లాడుతూ ‘మీ అవసరాల కోసం నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది మీరు కాదా?’ అని ప్రశ్నించారు. తనకు రాజకీయకాంక్ష ఉందంటూ జగన్‌ చెప్తున్నారని, అది నిజమని రుజువు చేయగలరా అని జగన్‌కు సవాల్‌ విసిరారు. వైఎస్‌ఆర్‌ బిడ్డను రాజకీయాలకు తీసుకు వచ్చింది ఎవరో? సమాధానం చెప్పాలన్నారు. ‘మీరు జైల్లో ఉంటే 19 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ప్రచారం చేయాలని అడిగింది మీరు కాదా?, చంద్రబాబు గ్రాఫ్‌ పెరుగుతుందని పాదయాత్ర చేయాలని చెప్పింది మీరు కాదా?, సమైక్యాంధ్ర ఉద్యమానికి నన్ను రాజకీయంగా వాడుకున్నది మీరు కాదా? సమాధానం చెప్పాలి’ అని జగన్‌ను డిమాండ్‌ చేశారు. జగన్‌ కోసం కష్టపడిన ఆ సమయంలో తనను ఎంపీ చేయాలని వైసిపి వారే చాలా మంది అడిగారని, అయినా తాను సైలెంట్‌గా ఉండిపోయానని తెలిపారు. రాజకీయాల కోసం తనను నెపోటిజం అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారెడ్డి, జయమ్మ, సౌభ్యగ్యమ్మ, వివేకా అందరూ రాజకీయాల్లో ఉన్నారని, అందరూ ఒకే జనరేషన్‌కి చెందిన వాళ్లేనని, అప్పుడు లేదా నెపోటిజం? అని ప్రశ్నించారు. ఇప్పుడు రవీంద్రనాథ్‌రెడ్డి, తమ్ముడు అని నెత్తిన పెట్టుకొని తిరిగే అవినాష్‌రెడ్డి, భారతి వీళందరినీ నెపోటీజం అనరా? దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయంగా వ్యతిరేకించినందుకు సొంత చెల్లిపైనే జగన్‌ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, మీరు చరిత్రలో నిలిచి పోతారని అన్నారు. వైఎస్‌ఆర్‌ మరణంలో రిలయన్స్‌ హస్తం ఉందని చెప్పింది ఈ జగన్‌ కాదా?, వాళ్ల ఆస్తులను ధ్వంసం చేయించలేదా?, అధికారంలోకి వచ్చాక వాళ్లకు ఎంపి పదవులు ఇవ్వలేదా? ఇదేనా నీకున్న విలువ? అని జగన్‌ను ప్రశ్నించారు.

➡️