Jindal: పరిశ్రమను తెరిపించండి

  • మంత్రి శ్రీనివాస్‌ను కోరిన కార్మికులు

ప్రజాశక్తి- కొత్తవలస (విజయనగరం జిల్లా) : జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరిశ్రమను తెరిపించేందుకు కృషి చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఆ పరిశ్రమ కార్మికులు కోరారు. సోమవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ను జిందాల్‌ కార్మికులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..యాజమాన్యం అక్రమంగా లాకౌట్‌ విధించడం వల్ల తామంతా రోడ్డున పడ్డామని తెలిపారు. లాకౌట్‌ ఎత్తివేసి, ఆ కాలానికి జీతాలు చెల్లించాలని కోరారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని, మరిన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, త్వరలో పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాల వలన ఇటువంటి పొరపాట్లు మరెన్నో జరిగాయని, వాటన్నింటికీ పరిష్కార మార్గం కనుగొంటామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో టిఎన్‌టియుసి నాయకులు పిల్లా అప్పలరాజు, సలాద్‌ భీమయ్య, సిఐటియు నాయకుడు నమ్మి చినబాబు తదితరులు ఉన్నారు.

భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించండి
కొత్తవలప మండలంలోని భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని మంత్రి శ్రీనివాస్‌ను లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ కోరారు. జిల్లాలో మూతపడిన పరిశ్రమల గురించి మంత్రికి వివరించారు. పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.

➡️