రెండో రోజూ ‘జిందాల్‌’కార్మికుల నిరసన

  • పరిశ్రమ గేటు వద్ద వంటావార్పు

ప్రజాశక్తి- కొత్తవలస (విజయనగరం జిల్లా) : జిందాల్‌ పరిశ్రమ అక్రమ లాకౌట్‌ను నిరసిస్తూ కార్మికులు పరిశ్రమ గేటు వద్ద రెండో రోజూ నిరసన కొనసాగించారు. అక్కడే మధ్యాహ్నం వంటావార్పు చేపట్టారు. వెంటనే పరిశ్రమను తెరిపించి ఇక్కడే పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా నాయకులు గాడి అప్పారావు మాట్లాడుతూ కంపెనీ లాకౌట్‌ను ఎత్తివేసి కార్మికులకు, ఉద్యోగులకు ఇక్కడే పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను, ఉద్యోగులను జాజ్‌పూర్‌ పంపిస్తే రవాణా సదుపాయంతో పాటు అక్కడ ఉండేందుకు హాస్టల్‌, భోజన సదుపాయం కల్పించడంతో పాటు అదనపు వేతనం కూడా ఇవ్వాలని కోరారు. కార్మికులకు టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సంఘీభావం ప్రకటించారు. జిందాల్‌ కంపెనీ డిజిం గోపాలకృష్ణతో చర్చించినట్లు తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు తాము అండగా ఉంటామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ టియుసి నాయకులు నెక్కల నాయుడుబాబు, జెడ్‌పిటిసి సభ్యులు నెక్కల శ్రీదేవి, టిడిపి నాయకులు తిక్కాన చినదేముడు, బొబ్బిలి అప్పారావు, ఎల్లపు సూరిబాబు, కొరుపోలు అప్పారావు, గోరా పల్లి రాము, జిందాల్‌ కార్మిక నాయకులు పిల్లా అప్పలరాజు, బాలిపోయిన ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డిసిఎల్‌కు సిఐటియు వినతి
జిందాల్‌ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ విజయనగరం డిసిఎల్‌ సుబ్రమణ్యానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ వినతిపత్రం అందించారు. కమిషనర్‌కు పంపించి తగు న్యాయం చేస్తామని డిసిఎల్‌ హామీ ఇచ్చారు.

➡️