విశాఖకు క్యాంపు కార్యాలయాల జిఓపై రిట్‌ప్రభుత్వ అభ్యంతరం

Dec 6,2023 16:30 #adjourned, #AP High Court

– ఈనెల 8కి విచారణ  వాయిదా

ప్రజాశక్తి-అమరావతివిశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం అనువైన ప్రదేశాలు గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ దాఖలైంది. దీని వెనుక దురుద్దేశం ఉందని ప్రభుత్వం వాదించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం ఐఎఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం జిఓ 2283ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని రాజధాని రైతులు సవాల్‌ చేయడాన్ని ప్రభుత్వం తరఫున ఎజి ఎస్‌ శ్రీరామ్‌ అభ్యంతరం చెప్పారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా వేయవలసిన దానిని, రిట్‌గా దాఖలు చేశారని ఇది ఫోరం షాపింగ్‌ (తమకు కావాల్సిన న్యాయమూర్తి వద్దకు వ్యాజ్యం వచ్చేలా చేయడం) అవుతుందని ఆయన వాదించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. జిఓ 2283ను రద్దు చేయాలని, ఈ లోగా స్టే ఇవ్వాలంటూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం వేసిన వ్యాజ్యాలను జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం విచారించారు. ఎజి వాదనల కొనసాగింపు కోసం విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

➡️