గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం చేయాల్సిందే..

  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించి న్యాయం చేయాల్సిందేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. కార్మికులు తిరగబడితే అదానీని మోడీ, జగన్‌, చంద్రబాబు కాపాడలేరని తెలిపారు. రూ.36 వేల వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని అదానీ గంగవరం పోర్టు కార్మికులు తలపెట్టిన ఆందోళన మంగళవారానికి ఏడో రోజుకు చేరింది. పోర్టు మెయిన్‌ గేటు వద్ద బైఠాయించిన కార్మికులకు లోకనాథం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల శ్రమ వల్లే కోట్లాది రూపాయల లాభాలను అదానీ రోజువారీ ఆర్జిస్తున్నారని తెలిపారు. కానీ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో మాత్రం అదానీ పోర్టు యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. బెదిరింపులకు కార్మికులు వెనక్కు తగ్గరన్న విషయం తెలుసుకోవాలన్నారు. 15 సంవత్సరాలుగా గంగవరం పోర్టులో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారికి రూ.16 వేలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. ఆ మొత్తంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు. విశాఖ పోర్టులో మాదిరిగానే అదానీ గంగవరం పోర్టులోనూ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్‌, గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి తాతారావు, ఉపాధ్యక్షులు కొవిరి అప్పలరాజు, నాయకులు ఉపేంద్ర, మహేష్‌, రవి పాల్గొన్నారు.

➡️