నేత్రపర్వంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం

Apr 17,2024 13:18 #Bhadradri Sitarams

భద్రాచలం : శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. తర్వాత కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు.
కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు. అభిజిత్‌ లగం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరసుపై జీలకర్రబెల్లం ఉంచి.. అనంతరం భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ పీఎస్‌ నరసింహా, హైకోర్ట్‌ జడ్జి భీమపాక నగేష్రా రామయ్య కల్యాణాన్ని వీక్షించారు.

➡️