కమనీయం…భద్రాద్రి రామయ్య కల్యాణం

Apr 17,2024 20:29 #in Bhadradri, #Sri Ramanavami
  •  ప్రభుత్వం తరఫున సిఎస్‌ లాంఛనాలు
  •  నేడు పట్టాభిషేక మహోత్సవం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు శోభయమానంగా కొనసాగుతున్నాయి. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. పట్టాభిషేక మహోత్సవాన్ని గురువారం నిర్వహిస్తారు. సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టడంతో కల్యాణ క్రతువు పూర్తవుతోంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కల్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ గావించారు. తరువాత భక్తులు గోటితో వలసిన తలంబ్రాలను సీతారాముల శిరస్సుపై పోశారు. తదనంతర కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు.లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారామచంద్రుల కళ్యాణం కోసం మిథిలా కల్యాణ మండపంలో 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు.

➡️