వైసిపిలో కర్ణాటక ‘గాలి’

Jan 8,2024 11:41 #Karnataka, #YCP
  • ఏపిలో టిక్కెట్ల కోసం జనార్ధన్‌రెడ్డి గ్రూపు ఒత్తిళ్లు
  • ఇప్పటికే హిందూపురం బరిలో శ్రీరాములు సోదరి శాంత
  • తాజాగా కర్నూలు ఎంపీ సీటు ఇవ్వాలని పట్టు
  • ఆలూరులో గుమ్మనూరుకు మోకాలడ్డు
  • జయరామ్‌కు మద్దతుగా రంగంలోకి డికె శివకుమార్‌ !

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీలో కర్ణాటక ‘గాలి’ సెగలు పుట్టిస్తోంది. మైనింగ్‌ దిగ్గజం గాలి జనర్ధాన్‌రెడ్డి, ఆయన సన్నిహితులు వాల్మీకి సామాజిక తరగతికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు గ్రూపు నుంచి ఏపిలో టిక్కెట్ల కోసం వైసిపిపై ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి శ్రీరాములు సోదరి జె శాంతను వైసిపి బరిలో నిలిపింది. తాజాగా కర్నూలు పార్లమెంటు స్థానం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ల కోసం పట్టు బడుతున్నట్లు సమాచారం. బళ్లారిలో మెజారిటీగా వున్న వాల్మీకి సామాజిక తరగతికి చెందిన శ్రీరాములు, నాగేంద్ర సహకారాలతో మైనింగ్‌ దిగ్గజం గాలి జనార్ధన్‌రెడ్డి కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు కింగ్‌మేకర్‌గా చక్రం తిప్పారు. అక్రమ మైనింగ్‌ కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లడం, బిజెపి బహిష్కరణ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రాభవం క్రమేపి తగ్గింది. ప్రస్తుతం ఆయన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కెఆర్‌పిపి) పేరిట సొంత పార్టీ నడుపుతున్నారు. అయితే శ్రీరాములు బిజెపిలో కొనసాగుతూనే జనార్ధన్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. నాగేంద్ర కాంగ్రెస్‌లో చేరారు. 2023లో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బళ్లారి నుంచి బిజెపి అభ్యర్థిగా శ్రీరాములు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాగేంద్ర పోటీ చేసినపుడు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ బళ్లారిలో మకాం వేసి నాగేంద్ర గెలుపు కోసం కృషి చేశారు. ప్రస్తుతం నాగేంద్ర కర్ణాటకలో యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయానికి కృషి చేసిన గుమ్మనూరుకు ఏపిలో చెక్‌ పెట్టాలని జనార్ధన్‌రెడ్డి గ్రూపు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి శాంతకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. అలాగే జయరామ్‌ రెండు పర్యాయాలు విజయం సాధించిన ఆలూరు నుంచి ఈ దఫా తప్పించాలని వైసిపిపై ఒత్తిడి తెస్తోంది. ఆయన స్థానంలో కురవ సామాజిక తరగతికి చెందిన బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్‌ శశికళకు ఇవ్వాలని ‘గాలి’ గ్రూపు కోరుతోంది. కాగా గుమ్మనూరుతో విభేదిస్తున్న విరుపాక్ష, మాజీ ఎమ్మెల్యే పి నీరజారెడ్డి కుమార్తె హిమవర్షిణి రెడ్డి, తెర్నేకల్‌ సురేంద్రరెడ్డి కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆలూరు టికెట్‌ ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు గానీ, జయరామ్‌కు మాత్రం ఇవ్వొద్దొని వైసిపిని ‘గాలి’ బృందం గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది.

అయితే గుమ్మనూరు జయరామ్‌ కూడా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌, తమ బంధువు అయిన మంత్రి బి నాగేంద్ర ద్వారా వైసిపి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వైసిపి టికెట్‌ను నిరాకరిస్తే కాంగ్రెస్‌ నుంచి అయినా పోటీలో నిలిచేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సొంత పార్టీ నేతల అసమ్మతితో సతమతమవుతున్న వైసిపికి కర్ణాటక ‘గాలి’ రాజకీయాలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి.

➡️