ఎపి నిట్‌ను ప్రగతిపథంలో నిలుపుతా 

Feb 15,2024 09:56 #NEET
Keeps AP nit on track

ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బిఎస్‌.మూర్తి

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): ఎపి నిట్‌ను సిబ్బంది సహకారంతో ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బిఎస్‌.మూర్తి తెలిపారు. హైదరాబాద్‌ ఐఐటి డైరెక్టర్‌గా విధుల్లో ఉన్న ఈయనకు కేంద్రప్రభుత్వం ఎపి నిట్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు నాగపూర్‌ ఎన్‌ఐటి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ప్రమోద్‌ పడోలే నిట్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా బిఎస్‌.మూర్తి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రగతిలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకమైందన్నారు. ప్రజలకు మేలు చేసే విభిన్న పరిశోధనలు, ప్రాజెక్టులపై దృష్టి సారించాలని తెలిపారు. దేశంలో 31వ నిట్‌గా అవతరించిన ఎపి నిట్‌ను టాప్‌-10లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తన దృష్టికి తీసుకొచ్చే ఏ సమస్యనైనా పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని వివరించారు. డీన్‌లు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందితో వివిధ అంశాలపై చర్చించి వారికి పలు సూచనలిచ్చారు. ప్రాంగణంలోని భవన సముదాయాలను పరిశీలించారు. ముందుగా రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌శంకర్‌రెడ్డి మూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్‌లు డాక్టర్‌ జిఆర్‌కె.శాస్త్రి, డాక్టర్‌ టి.కురుమయ్య, డాక్టర్‌ ఎన్‌.జయరామ్‌, డాక్టర్‌ జిబి.వీరేష్‌కుమార్‌, డాక్టర్‌ కార్తీక్‌ శేషాద్రి, ఆచార్యులు డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ కృష్ణమూర్తి, డాక్టర్‌ రాముడు తదితరులు పాల్గొన్నారు.

 

➡️