ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కుమార విశ్వజిత్‌

  •  విజయవాడ పోలీసు కమిషనరుగా రామకృష్ణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా అదనపు డిజిపి కుమార విశ్వజిత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌కుమార్‌.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే విజయవాడ పోలీసు కమిషనరుగా ఎసిబిలో డిఐజిగా ఉన్న పిహెచ్‌డి రామకృష్ణను నియమించారు. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. విశ్వజిత్‌ ప్రస్తుతం రైల్వేలో ఉన్నారు. 2019 మార్చి 31 నుండి డిసెంబర్‌ నాలుగోతేదీ వరకూ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ పోస్టులోకి రావడంతో విశ్వజిత్‌కు ఇది రెండోసారి. ఇప్పటి వరకూ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న కాంతి రాణా టాటాను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానంలో రాష్ట్ర ఫ్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ వారిద్దరినీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ 25వ తేదీ ఉదయం 11 గంటలలోపు బాధ్యతలు చేపట్టాలని అందులో సూచించారు.
1994 క్యాడర్‌ అధికారి అయిన విశ్వజిత్‌ నాగర్‌ కర్నూల్‌, మెదక్‌, అనంతపురంలో వేర్వేరు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రెండు, నాలుగు బెటాలియన్‌ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన తర్వాత కొసావోలో శాంతి బృందంలో ఐక్యరాజ్య సమతి ఆదేశాల మేరకు పనిచేశారు. అనంతరం ఉత్తరాంచల్‌లో డిఐజిగా విధులు నిర్వహించిన తర్వాత సిఐడి ఐజి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రైల్వే ఎడిజిపిగా ఉన్నారు.
2001 క్యాడర్‌ అధికారైన పిహెచ్‌డి రామకృష్ణ 2001లో డిఎస్‌పిగా బాధ్యతలు చేపట్టి 2011లో ఎఎస్‌పిగా, ఇంటెలిజెన్స్‌ ఎస్‌పిగా బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు, కడప, నెల్లూరు ఎస్‌పిగా పనిచేశారు. గుంటూరులోనే మూడుసార్లు ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్‌ఇబి డిఐజిగా, ప్రస్తుతం ఎసిబిలో డిఐజిగా విధులు నిర్వహిస్తున్నారు.

➡️