భూ హక్కుల చట్టంపై న్యాయవాదుల నిరసన

Dec 18,2023 20:26 #Dharna, #lawer

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి :ఎపి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజమహేంద్రవరం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. బైకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎపి భూహక్కుల చట్టం రద్దు చేయాలని, ఎపి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని నినదించారు. ఈ నెల 22 వరకు విధులను బహిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన ఎపి భూ హక్కుల చట్టం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందన్నారు. భూ హక్కులను కాపాడుకోవడం కష్టసాధ్యమవుతుందని తెలిపారు. అధికార, అంగ, ధన బలం ఉన్నవారు భూ అక్రమణలకు పాల్పడటానికి ఈ చట్టం అనువుగా ఉంటుందన్నారు. ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారులకు జ్యుడీషియల్‌ పవర్స్‌ ఈ చట్టం ద్వారా ఇస్తారని చెప్పారు. ఫలితంగా అక్రమాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు చేసే అవకతవకల వల్ల ఉన్న కేసుల్లో అత్యధిక భాగం భూ వివాదాలకు సంబంధించినవేనన్నారు. ఇవి ఇప్పటికీ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు చేసిన అవకతవకలపై స్థానిక న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే అవకాశం లేదన్నారు. భూ వివాదాలకు సామాన్యుడు సైతం చివరికి హైకోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కవి హనుమంతరావు, కోశాధికారి ఎం.వి.దుర్గాప్రసాద్‌, ఉపాధ్యక్షులు గేదెల వెంకటేశ్వరరావు, జాయింట్‌ సెక్రటరీలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️