విద్యుత్‌ భారాలపై వామపక్షాల నిరసన

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం)విద్యుత్‌ ఛార్జీల పెంపు జోలికి వెళ్లబోమని, ఉన్న ఛార్జీలు తగ్గించి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం తన పాలనలో వరుసగా ఐదోసారి విద్యుత్‌ ఛార్జీల మోతకు సిద్ధమవుతోందంటూ వామపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని నిరసిస్తూ విశాఖ గురుద్వారా సమీపాన ఉన్న ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ బూటకపు అభిప్రాయ సేకరణ అని మండిపడ్డారు. గతంలో టిడిపి విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని విమర్శిస్తూ… తాను వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచనని చెప్పిన జగన్‌ అధికారం చేపట్టాక మాట తప్పారన్నారు. ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తూ మోడీకి తొత్తుగా మారారని విమర్శించారు. గతంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల ఆగ్రహానికి గురై ఇంటికి వెళ్లిన ప్రభుత్వాల గతే నేటి ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, వామపక్ష పార్టీల నాయకులు కృష్ణారావు, నాయనిబాబు, జి.రాంబాబు, ఎస్‌కె.రెహమాన్‌, ఎం.మన్మధరావు, కొండయ్య, కుమారి పాల్గొన్నారు

➡️