ప్రజావాణి వినిపిస్తాం

Apr 22,2024 08:30 #2024 election, #ap election, #cpm
  • అసెంబ్లీకి కమ్యూనిస్టులను గెలిపించండి 
  • సిపిఎం అభ్యర్థుల ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ.. ప్రజలకు అండగా ఉంటున్న తమను గెలిపించాలని సిపిఎం అభ్యర్థులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శాసన సభకు కమ్యూనిస్టులను పంపాలని, ప్రజల వాణి వినిపించే అవకాశం ఇవ్వాలని కోరారు. కూటమికి, వైసిపికి ఓటేస్తే రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో రాష్ట్రానికి ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా రాలేదని, ఉన్న విశాఖ ఉక్కును కూడా అమ్మేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌, రాజీవ్‌నగర్‌, హుడా కాలనీలో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు ముమ్మరంగా ప్రచారం చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండేది కమ్యూనిస్టులేనని తెలిపారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సింగ్‌నగర్‌ నుండి రాజీవ్‌నగర్‌ కండ్రిక వరకు కమ్యూనిస్టులు కార్పొరేటర్‌గా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని అగ్రహారం కొండమొదలు, మంటూరు, ఏనుగులపేట, బీంపల్లి గ్రామాల్లో అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేపట్టారు. విఆర్‌.పురంలో ఆటో మైక్‌ ప్రచారం సాగింది. డుంబ్రిగుడ, అరకులోయ, జి.మాడుగుల మండలాల్లోని ఇంటింటి ప్రచారం చేశారు. మారేడుమిల్లి మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇండియా వేదిక అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు 65వ వార్డులోని భానోజీతోట, బాపూజీ కాలనీ, నేతాజీ కాలనీ, వాంబే కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి కార్మికవర్గం నుంచి విశేష స్పందన లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొట్టు, గుణదతీలేసు, కెమిశీల, తొడుము, పాలెం పంచాయతీల్లో, గుమ్మలక్ష్మీపురం మండలంలోని రాయగడ జమ్మూ, చాపరాయి బిన్నిడి గ్రామాల్లో, కురుపాం మండలం ఊసకొండలో అభ్యర్థి మండంగి రమణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని షరీన్‌నగర్‌, రాఘవేంద్రనగర్‌, బద్రీనాథ్‌ నగర్‌లో డి.గౌస్‌దేశారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. తనను గెలిపిస్తే పాణ్యం నియోజకవర్గం దశ, దిశ మారుస్తామని హామీ ఇచ్చారు. కల్లూరు అర్బన్‌ పరిధిలోని 37, 41 వార్డుల్లో గౌస్‌ దేశారు గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. కల్లూరు కాలనీలలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీరాలంటే ఇండియా వేదిక బలపరుస్తున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నెల్లూరు నగరంలోని రేబాల వీధి, స్టోన్‌ హౌస్‌ పేట, తడికల బజారు సెంటర్‌, రామచంద్రపురం ప్రాంతాల్లో సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు నగరాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లిలో సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావును గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. మరోసారి బిజెపి అధికారంలో వస్తే దళితులు, ముస్లిం, క్రైస్తవుల మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని వివరించారు. బిజెపితో అంటకాగిన టిడిపి, వైసిపిని ఓడించాలని కోరారు.

➡️