ఆరోగ్యశ్రీ పై విషప్రచారం.. టిడిపి, బిజెపిలపై మల్లాది విష్ణు ఆగ్రహం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని, టిడిపి, బిజెపి కావాలని విషప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన చరిత్ర టిడిపిదేనన్నారు. టిడిపి పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ దుర్వినియోగం కాగా, వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా పారదర్శకంగా చెల్లిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91లక్షల మందికి రూ.13,471 కోట్ల విలువైన వైద్యసేవలందించామని పేర్కొన్నారు. ఇంటి వద్దకే వైద్య సేవలందించేలా ఫ్యామిలీ డాక్టర్‌, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం నిర్వహించిందని, టిడిపి అధికారంలో ఉండగా ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారో చంద్రబాబు సమాధానం చెప్పాలని విష్ణు డిమాండ్‌ చేశారు. నీత ఆయోగ్‌ విడుదల చేస్తున్న ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.

➡️