ఎలుగుబంటి దాడిలో యానిమల్‌ కీపర్‌ మృతి

Nov 28,2023 09:47 #Animal attack, #Deaths, #Visakha, #ZOO
  • విశాఖ ఇందిరా జూ పార్కులో విషాదం

ప్రజాశక్తి- ఆరిలోవ (విశాఖపట్నం): విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. హిమాలయన్‌ ఎలుగుబంటి దాడి చేయడంతో యానిమల్‌ కీపర్‌ మృతి చెందారు. ఇక్కడి జంతు ప్రదర్శనశాలలో ఇటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా కథనం ప్రకారం… విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం తిమిటేరు బూర్జవలస గ్రామానికి చెందిన బనవారపు నగేష్‌ (23) ఏడాదిన్నర క్రితం విశాఖ జూ పార్కులో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో యానిమల్‌ కీపర్‌గా చేరారు. సోమవారం ఉదయం రిజ్వాన్‌ అనే పేరుగల హిమాలయన్‌ ఎలుగుబంటి ఉండే నైట్‌ క్రాల్‌ను శుభ్రం చేసేందుకు ఎప్పటిలాగే వెళ్లారు. సాధారణంగా ఎలుగుబంటి ఉన్న నైట్‌ క్రాల్‌కు నాలుగు గేట్లు ఉంటాయి. మొదట ప్రధాన గేట్‌ను తెరిచి వేరే గదిలో ఉన్న ఎలుగుబంటికి ఆహారం అందిస్తారు. ఆ తరువాత దాన్ని సందర్శకుల కోసం వేరే గేట్‌ ద్వారా డే క్రాల్‌లోకి వదులుతారు. ఇలా వదిలిన వెంటనే ఆ ద్వారాన్ని మూసివేసి ఎలుగుబంటి ఉండే గదిని శుభ్రం చేస్తారు. అయితే, గేటును మూయకుండా గదిని శుభ్రం చేసే క్రమంలో బయటకు వెళ్లిన ఎలుగుబంటి తిరిగి వచ్చి గదిని శుభ్రం చేస్తున్న నగేష్‌పై దాడి చేసింది. తీవ్రగాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని కుటుంబానికి అటవీ శాఖ నుంచి రూ.10 లక్షలు అందివ్వనున్నట్టు క్యూరేటర్‌ తెలిపారు. నగేష్‌పై దాడి చేసిన హిమాలయన్‌ ఎలుగుబంటిని ఏడాదిన్నర క్రితం మిజోరాంలోని ఐజ్వాల్‌ జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకువచ్చామన్నారు. ఆరిలోవ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. సిఐ సోమశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నం!

నగేష్‌ ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఎలుగుబంటి ఉండే నైట్‌ క్రాల్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లారు. 10.30 గంటలకు జూనియర్‌ వైద్యుడు ఎలుగుబంటి ఉండే నైట్‌ క్రాల్‌కు వెళ్లారు. ఎలుగుబంటి స్థితిగతులను తెలియజెప్పాల్సిన నగేష్‌ ఆయనకు కనిపించలేదు. అదే సమయంలో నైట్‌ క్రాల్‌ నాలుగు గేట్లూ తెరిచి ఉండడాన్ని ఆయన గమనించారు. ఆ ప్రాంతంలో వెతకగా నగేష్‌ విగతజీవిగా కనిపించారు. నగేష్‌ మృతి చెందిన విషయాన్ని జూ అధికారులు గోప్యంగా ఉంచారు. మధ్యాహ్నం తరువాత విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు జూ పార్కుకు చేరుకున్నా చాలాసేపు వరకు వారిని అధికారులు లోపలకు అనుమతించలేదు. జూ పార్కులో ప్రమాదకరమైన జంతువుల సంరక్షణలో అనుభవజ్ఞులైన యానిమల్‌ కీపర్లను ఉంచకపోవడంతోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జంతువుల నైట్‌ క్రాల్స్‌లో సిసి కెమెరాలు అమర్చకపోవడంతో ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకోలేకపోతున్నారు.

➡️