రోడ్డు పునర్నిర్మాణం కోసం మానవహారాలు

Feb 13,2024 08:12 #Dharna, #roads issue
  •  అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకూ ఊరూరా కదిలిన ప్రజలు

ప్రజాశక్తి – అనకాపల్లి, మునగపాక, అచ్యుతాపురం విలేకరులు :శిథిలమైన రోడ్డును వెంటనే పునర్నిర్మాణం చేయాలని, భారీ వాహనాలను తిరగకుండా నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ అనకాపల్లి బైపాస్‌ రోడ్డు నుంచి అచ్యుతాపురం వరకూ సోమవారం భారీ మానవహారాలు జరిగాయి. రహదారి పునర్నిర్మాణ పోరాట కమిటీ ఆధ్వర్యాన అనకాపల్లి బైపాస్‌ రోడ్డు, నాగులాపల్లి, ఒంపోలు, మునగపాక, అచ్యుతాపురం, తిమ్మరాజుపేట, కొండకర్ల జంక్షన్‌, హరిపాలెం తదితర చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కదిలివచ్చిన ప్రజానీకం రహదారి సమస్యపై పెద్దపెట్టున నినాదాలు చేశారు. మునగపాక మండల కేంద్రంలో జరిగిన మానవహారాన్ని ఉద్దేశించి సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ ఏళ్ల తరబడి రోడ్డు శిథిలమై ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా రహదారి కష్టాలు తీరడంలేదని అన్నారు. అచ్యుతాపురంలోని కంపెనీలకు భారీ వాహనాలు పరవాడ, రాంబిల్లి మార్గాల మీదుగా వెళ్లాల్సి ఉండగా సమయం కలిసొస్తుందని అనకాపల్లి బైపాస్‌ నుంచి వెళ్లడంతో రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. కంపెనీల నుంచి వచ్చే సిఎస్‌ఆర్‌ నిధులతో రహదారులతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. కానీ ఆ నిధులు దళారుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాబట్టుకుని రహదారుల పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పది రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభం కాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో రహదారి పునర్నిర్మాణ కమిటీ కన్వీనర్‌ కాండ్రేగుల రామసదాశివరావు, సిపిఎం నాయకులు వివి.శ్రీనివాసరావు, కర్రి అప్పారావు, అనకాపల్లి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పైడారావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు, పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

➡️