ఆరోగ్యశ్రీపై ముమ్మర ప్రచారం

Dec 5,2023 09:03
  • ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయాలి
  • సమీక్షలో సిఎం వైఎస్‌ జగన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ పథకంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్యారోగ్యశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీపై సిహెచ్‌ఒలు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నిరంతరం చేయుతనివ్వాలన్నారు. రోగులకు మందులు అందించడం అనంతరం ఫాలోఅప్‌ చేయాలన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్న వారికి అవసరమైన మందులు, ఆపరేషన్‌ చేయించాలన్నారు. చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు పంపించేటప్పుడు వారికి రవాణా ఖర్చులు కింద రూ.500 ఇవ్వాలన్నారు. కంటి చికిత్సలు కాకుండా, ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారన్నారు. ఇందులో 73,602 మందిని ఇప్పటికే చికిత్సకు ఆస్పత్రులకు తరలించారన్నారు. 13,614 మందికి ఇప్పటికే కాటరాక్ట్‌ చికిత్సలు చేయించామన్నారు. అలాగే 5,26,702 మందికి కంటి అద్దాలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌ ప్రతి గ్రామానికీ వెళ్తున్నారని, మందులు కూడా అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు అధికారులు వివరించారు.

18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు తెలిపారు. 1.42 లక్షల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వేగంగా ప్రింట్‌ అవుతున్నాయని చెప్పారు.

➡️