వలసల నివారణకు చర్యలు : ‘రా కదలి రా’ సభల్లో చంద్రబాబు

Jan 29,2024 10:23 #meeting, #Nara Chandrababu, #speech
  • 20 లక్షల ఉద్యోగాలు, మూడువేలు నిరుద్యోగ భృతి

ప్రజాశక్తి – కర్నూలు, నెల్లూరు ప్రతినిధి : వలసలను ఆపే బాధ్యత తాము తీసుకుంటామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సీమకు గోదావరి జలాలు తెస్తామని, సీమ ప్రజలకు 90 శాతం రాయితీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇస్తామని, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇస్తామని, రైతులందరికీ సోలార్‌ విద్యుత్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులను పూర్తిగా ఆదుకునే బాధ్యత తమదని అన్నారు. కొందరు వ్యక్తులు తనను ఏదోదో మాట్లాడుతున్నారని, రాష్ట్రం కోసం, ప్రజల కోసం భరిస్తున్నానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఎవరినీ వదలనని హెచ్చరించారు. కర్నూలు జిల్లా పత్తికొండ, నెల్లూరులో జరిగిన రా కదలి రా బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. వైసిసి వెంటిలైటర్‌పై ఉందని, మరో 72 రోజుల్లో ఆ పార్టీ పని అయిపోతుందని అన్నారు. తాను సిద్ధమంటూ సభ ఏర్పాటు చేశారని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు జగన్‌పై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వ్యాపావేత్తలు సైతం సొంత ప్రాంతాలు వదిలి వెళ్లిపోతున్నారని, వైసిపి అరాచకాల వల్ల ఎంపి గల్లా జయదేవ్‌ రాజకీయాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగులు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. మూడు వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వైసిపిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి, జనసేన ప్రభుత్వ ఆవశ్యకతను చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. వైనాట్‌ 175 అని జగన్‌ అంటున్నారని, ముందు పులివెందులలో గెలవాలని సవాల్‌ విసిరారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకే జగన్‌ సీట్లు మారుస్తున్నారని, కబ్జాలు చేసే వారిని మాత్రం మార్చడం లేదని విమర్శించారు. మద్యపాన నిషేధంపై మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. మాదిగలకు న్యాయం చేసేలా ఎస్‌సి వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

➡️