పాత పెన్షన్‌ అమలుకోసం రాజమండ్రిలో 28న సభ

Jan 21,2024 08:27 #poster avishkarana, #utf
  • రాజకీయ పార్టీల వైఖరి స్పష్టం చేయాలి యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాత పెన్షన్‌ విధానం(ఓపిఎస్‌) సాధనకోసం ఈ నెల 28వ తేదిన రాజమండ్రిలో సభ నిర్వహిస్తున్నామని యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ సభకు ఆహ్వానిస్తున్నామని, ఆయా పార్టీలు ఓపిఎస్‌పై వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్‌ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిన వారందరికీ పాత పెన్షన్‌ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సిపిఎస్‌) అమల్లోకి వచ్చిందన్నారు. సిపిఎస్‌ తమకు వద్దని, పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. పోరాటాల ఫలితంగా 50శాతం పెన్షన్‌ మాత్రం ఇస్తామని 2019 ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పాత పెన్షన్‌ అమలు చేస్తానని ప్రతిపక్షనేతగా పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వాగ్దానం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత ఓపిఎస్‌ సాధ్యం కాదని చేతులేత్తేసిన విషయాన్ని గుర్తుచేశారు. మెరుగైన జిపిఎస్‌ విధానాన్ని తీసుకొస్తున్నామని చట్టం చేసి, 50శాతం పెన్షన్‌కు అదనంగా డిఎ ఇస్తామని చెబుతున్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సిపిఎస్‌, జిపిఎస్‌లు నష్టదాయకమనిచెప్పారు. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగికి ఓపిఎస్‌ జీవితం భద్రతనిస్తుందని, దీనినే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో సగం మందికి ఎటువంటి పెన్షన్‌ లేదని, వీరికి వృద్ధాప్య దశలో జీవనం కొనసాగించడానికి ఎటువంటి భరోసా లేదని తెలిపారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో తెలిపేందుకు మానిఫెస్టో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. అన్ని పార్టీలు వారి మానిఫెస్టోలో ఓపిఎస్‌ అమలు చేస్తామని పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలను రాజమండ్రి సభకు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఓపిఎస్‌ అమలుపై వారి వైఖరి స్పష్టం చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 5.5లక్షల మంది ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని, వారి చివరి వేతనంలో 50శాతం పెన్షన్‌, గ్రాట్యూటి చెల్లించేలా పెన్షన్‌ స్కీం ప్రకటించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఫెడరేషన్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎస్‌ కుసుమకుమారి, కార్యదర్శి ఎస్‌పి మనోహర్‌ కుమార్‌, ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం హనుమంతరావు, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు, ఎ సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️