పకడ్బందీగా మెగా డిఎస్‌సి : మంత్రి లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్‌సిని పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆదేశించారు. టెట్‌, మెగా డిఎస్‌సి నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. టెట్‌, మెగా డిఎస్‌సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని లోకేష్‌ చెప్పారు. డిఎస్‌సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. టెట్‌ సిలబస్‌ అంశంపై ఆరా తీశారు. సిలబస్‌లో ఎటువంటి మార్పులూ చేయలేదని, ఫిబ్రవరి-2024లో నిర్ణయించిన సిలబస్‌తోనే టెట్‌ నిర్వహించబోతున్నామని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌, కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ వివరించారు. కొన్ని జిల్లాలకు పలు విభాగాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయని అభ్యర్థులు తనను కలిశారని లోకేష్‌ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో పోస్టులు తగ్గాయని అధికారులు వివరించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్‌ ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 117తో కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిఎస్‌సిలో వయోపరిమితి సడలింపు అంశాలను మంత్రి దృష్టికి అధికారులు తీసుకురాగా, చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్‌సి నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్‌సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అవుట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న 1,633 మంది బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని అధికారులను లోకేష్‌ ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి లోకేష్‌ సూచించారు. మెనూకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్యం, తాగునీటి వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కడప జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలో పైకప్పు కూలి ఆరుగురు విద్యార్థులు గాయపడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని లోకేష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కావలి సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢకొీన్న ఘటనపైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

స్కిల్‌ సెన్సెస్‌ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
స్కిల్‌ సెన్సెస్‌ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని స్కిల్‌డెవలప్‌మెంట్‌శాఖ అధికారులను మంత్రి నారా లోకేష్‌ ఆదేశించారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ సెన్సెస్‌లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధి విధానాలపై చర్చించారు. విదేశాల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో స్కిల్‌డెవలప్‌మెంట్‌, ట్రైనింగ్‌ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌, ఎమ్‌డి రాజబాబు, డిఇటి నవ్య, సిఇఒ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️