‘మెగా’నా…’మినీ’నా!

Jun 19,2024 07:36 #'Mega'na., #'mini'na!

-అమరావతి ఎలా?
-ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :రాజధాని అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీటిలో ఒకటి మెగా కార్పొరేషన్‌ చేయాలన్న ప్రతిపాదన! సిఆర్‌డిఎను అలాగే ఉంచి, దానిలో విడివిడిగా మిని స్థానిక సంస్థలను అభివృద్ధి చేయడం మరొకటి. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను రద్దు చేసి, విడివిడి మున్సిపాల్టీలుగా ఏరాటుచేయడం, వీటితో పాటు, రాజధాని ప్రాంతంలో కొన్ని పంచాయతీలను కూడా కొనసాగించాల్సిఉంటుంది. కీలకమైన ప్రాంతంలో పంచాయతీలు ఉండటం వల్ల రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి, నిర్మాణ పనులు వేగంగా జరగడానికి వీలవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటిలో దేనివైపు ప్రభుత్వం మొగ్గుచూపుతుందో చూడాల్సిఉంది.
‘మెగా’ ఇలా…
ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. వీటికి అనుబంధంగా మరికొన్ని ప్రాంతాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చితే కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా వీలైనంత ఎక్కువ నిధులు పొందవచ్చన్నది ఒక వాదన. ఫలితంగా
ప్రజలకు త్వరితగతిన మౌలిక సదుపాయల కల్పనకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి టిడిపి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయలేదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీని గురించి విస్తృత ప్రచారం చేస్తూనే 2020లో మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించకుండా ఈ రెండు పట్టణాలతోపాటు దాదాపు 20 గ్రామాలను కలిపి మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటిఎంసి)గా ప్రతిపాదనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది టిడిపి నాయకులు కోర్టుకెళ్లారు. కోర్టు స్టే ఇవ్వడంతో మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత రాజధాని గ్రామాలను కలిపి ఒకసారి, కేవలం తుళ్లూరు మండలంలోని 19 పంచాయతీలను కలిపి మరోసారి మున్సిపాల్టీగా చేసేందుకు వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి గ్రామపంచాయతీల్లో ప్రజాభిప్రాయసేకరణ చేసింది. దీనిని కూడా రాజధాని రైతులు వ్యతిరేకించారు. ఈ ఉత్తర్వులపై కూడా కోర్టు స్టే విధించింది. రాజధానిలో కీలకమైన తుళ్లూరు మండలంలో టిడిపి బలంగా ఉండడంతో వైసిపి ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి ఎన్నికలూ నిర్వహించలేదు. మున్సిపల్‌ పట్టణాల మార్పునకు ప్రయత్నిస్తూ నాలుగేళ్లపాటు కాలయాపన చేసింది. మొత్తంమీద మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో గత ఆరేళ్లుగా ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు మూడు మండలాలను కలిపి మెగా కార్పొరేషన్‌గా మార్చితే టిడిపికి పూర్తి అనుకూలత ఏర్పడుతుందని పలువురు నేతలు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మండలాల్లో దాదాపు మూడున్నర లక్షల జనాభా ఉంటుందని అంచనా. విజయవాడ, గుంటూరు మధ్యలో మరొక గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రాంతం ఒకే నగరపాలక సంస్థ కింద ఉండడం కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
‘మినీ …’ ఎందుకంటే…?
మెగా నగర పాలక సంస్థ కన్నా విడివిడి మున్సిపాల్టీలు, పంచాయతీల ఏర్పాటే మేలన్నది మరో అభిప్రాయం. నగర పాలక సంస్థల్లో రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ అంత సులభం కాదని, అనేక నిబందనలు అడుపడుతాయన్న వాదన వినిపిస్తోంది. నిర్మాణాలకు అనుమతులు రావడం కూడా కష్టమవుతుందని చెబుతున్నారు. పంచాయతీల్లో అయితే ఆ సమస్య ఉండదని అందువల్ల అభివృద్ధి పనులు వేగంగా చేయవచ్చని అంటున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి అక్కడ ఉన్న పంచాయతీ వ్యవస్థ కూడా దోహదం చేసిందని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఈ మొత్తం ప్రాంతాన్ని మెగా నగరపాలక సంస్థగా మారిస్తే వీరి ఉపాధి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 19 పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. దీనిని ఇక్కడి వ్యవసాయ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ఉపాధి హమీ చట్టం కింద పనులు చూపాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం ప్రాంతాన్ని నగర పాలకసంస్థగా మారిస్తే మరో 20, 25 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఏర్పడి, స్థానికంగా ఆందోళనలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ పరిస్థితిని నివారించి ఉపాధి హామీ పనులు కొనసాగించేలా ప్రభుత్వ వ్యూహం ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలోనూ మార్పులు…
రాజధాని ప్రాంతానికి అమరావతి అన్న పేరు పెట్టడానికి స్ఫూర్తినిచ్చిన అసలైన అమరావతి (అమరావతి గుడి, బౌద్ధ క్షేత్రం) గ్రామాన్ని గత ప్రభుత్వం పల్నాడు జిల్లాలో కలిపింది. మరో విధంగా చెప్పాలంటే రాజధాని (కొత్త అమరావతి) ప్రాంతానికి , ఆ ప్రాంతానికి ఎటువంటి సబంధం లేని స్థితిని ఏర్పాటు చేసింది. దీనిని మార్చాలన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పాత అమరావతిని కూడా రాజధాని ప్రాంతంలోకి తీసుకురావాలంటే ప్రస్తుతమున్న జిల్లాల్లోనూ మార్పులు చేయాల్సివస్తుంది. రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం మొత్తాన్ని అమరావతి జిల్లాగా ఏర్పాటు చేయాలన్న మరో వాదన కూడా వినిపిస్తోంది.

➡️