బాలోత్సవాలతో విద్యార్థుల్లో మానసిక పరిపక్వత

  • హేలాపురి బాలోత్సవాం4 ప్రారంభంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు
  • తణుకు, పల్నాడులో ప్రారంభమైన బాలోత్సవాలు

ప్రజాశక్తి – యంత్రాంగం :    ర్యాంకులు, మార్కులే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో మానసిక పరిపక్వత వస్తోందని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. ఏలూరు అమీనాపేటలోని శ్రీసురేంద్ర బాహుగుణ స్కూల్‌ షేక్‌ సాబ్జీ స్మారక ప్రాంగణంలో రెండురోజులపాటు జరగనున్న హేలాపురి బాలోత్సవాం4 శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ సూచికగా జాతీయ జెండాను, బాలోత్సవం జెండాను ఐ. వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పిల్లల్లో ప్రతిభను వెలికితీసేందుకు బాలోత్సవం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కేరళలో ముందుగా అక్షరాస్యత ఉద్యమం ప్రజా ఉద్యమంలా సాగిందని, ఆ నేపథ్యంలో పెద్దఎత్తున బాలోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో హేలాపురి బాలోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలు అన్ని రంగాల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.

మరో ముఖ్యఅతిథి డిఇఒ పి.శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని కోరారు. బాల్యపు జ్ఞాపకాలు జీవితాంతం ఉంటాయని, ఇలాంటి బాలోత్సవాలు మరెన్నో జరగాలని ఆశించారు. ‘చదవాలిరా ఎన్ని ఆటంకాలచ్చినా..’ పాటను వెయ్యి మందికిపైగా ఒకేసారి పాడడంతో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైనట్లు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ రాష్ట్ర ప్రతినిధి మువ్వా శ్రీనివాస్‌ ప్రకటించి, సర్టిఫికెట్‌ను ఆహ్వాన సంఘ నాయకులకు అందజేశారు. అనంతరం 60 రకాల సాంస్కృతిక, అకాడమిక్‌ పోటీలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ తణుకు, మానవత సంయుక్త ఆధ్వర్యంలో బాలోత్సవం నిర్వహించారు.పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక పల్నాడు రోడ్డులోని పాలడుగు నాగయ్య చౌదరి కొత్త రఘురామయ్య కళాశాలలో బాలోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 150 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.  పోటీలను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ చైర్మన్‌ గుంటూరు విజరు కుమార్‌ ప్రారంభించారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. పిల్లల్లో ప్రతిభను వెలికితీసేందుకు బాలోత్సవాలు దోహదపడతాయన్నారు. కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడారు. కోలాటం, జానపద నృత్యం, లఘు చిత్రాలను విద్యార్థులు ప్రదర్శించారు.

➡️