ఎంహెచ్‌ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2024 ఎంట్రీలకు ఆహ్వానం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :’ప్రజాశక్తి’ వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు -2024 కోసం ప్రజాశక్తి సాహితీ సంస్థ ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. పాత్రికేయ రంగంలో విశేషంగా కృషి చేసిన జర్నలిస్టులను సత్కరించేందుకు కోవిడ్‌ కాలంలో మినహా ప్రతియేటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు సాహితీ సంస్థ కార్యదర్శి ఎంవిఎస్‌ శర్మ మంగళవారం నాడిక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ పాత్రికేయులు తెలకపల్లి రవి అధ్యక్షతన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసరు జి అనిత, సీనియర్‌ జర్నలిస్టు నల్లి ధర్మారావుతో కూడిన అవార్డు ఎంపిక కమిటీ సూచన మేరకు ఏదేని అంశంపై మానవాసక్తికర వార్తా కథనాలను ఎంట్రీలుగా ఆహ్వానిస్తున్నామన్నారు. 2023 మే ఒకటి నుంచి 2024 జూన్‌ 18 వరకు తెలుగు దినపత్రికల్లో ప్రచురితమైన మానవాసక్తికర కథనాలను మాత్రమే ఎంట్రీలుగా పంపాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు ఇందులో పాల్గనవచ్చని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ఇతరుల వార్తా కథనాలను ఎవరైనా సూచించవచ్చని ఆ ప్రకటనలో కోరారు. ప్రజాశక్తి సంస్థ జర్నలిస్టులు ఈ విభాగంలో పంపకూడదని తెలిపారు. ఎంట్రీతో పాటు ఇది నా సొంతరచన, ఎవరినీ అనుకరించినది కాదని స్వీయ ధ్రువీకరణ పత్రం జత చేసి పంపాల్సి ఉంటుందన్నారు. ఎంట్రీలు 2024 జులై 18 నాటికల్లా మాకు అందేటట్లు పంపాలని, కవర్‌పై ఎంహెచ్‌ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2024 కోసం అని స్పష్టంగా పేర్కొనాలని ఆ ప్రకటనలో కోరారు. ఇామెయిల్‌ ద్వారా కూడా పంపవచ్చన్నారు. అవార్డు విజేతకు 2024 ఆగస్టులో జరిగే ఎంహెచ్‌ స్మారకోపన్యాస సభలో జ్ఞాపిక, రూ.10 వేలు నగదు ఇచ్చి సముచిత రీతిలో సత్కరించడం జరుగుతుందన్నారు. ప్రజాశక్తి సంస్థ జర్నలిస్టులు ఈ విభాగంలో పంపనవసరం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంట్రీలు పంపాల్సిన చిరునామా:
ప్రజాశక్తి సాహితీ సంస్థ,
ప్రజాశక్తి భవనం,
అమరారెడ్డి కాలనీ,
తాడేపల్లి, గుంటూరు జిల్లా,
పిన్‌కోడ్‌-522501,
ఇ మెయిల్‌ అడ్రస్‌: [email protected]

➡️