రాష్ట్రానికి తప్పిన తుపాను ముప్పు

May 24,2024 08:54 #cyclone threat, #missed, #State

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఆ వాయుగుండం పశ్చిమ బెంగాల్‌ వైపు కదలడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొన్నారు. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లద్దని తెలిపారు. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్‌టిఆర్‌, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొన్నారు. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం వుందని తెలిపారు.

➡️