ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం

  • పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
  • లోక్‌సభలో నీట్‌పై చర్చకు పట్టు… నిరాకరించిన ప్రభుత్వం
  • ప్రతిపక్షాల వాకౌట్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్ష ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలపై మోడీ ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా సోమవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రతిపక్ష ఇండియా వేదికకు చెందిన ఎంపిలు ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు హోరెత్తించారు. ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయడం కోసం.. వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ఆపాలని మోడీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు. అవినీతి చేసిన వారు బిజెపిలో చేరితే, వారికి అవినీతి చేసుకునేం దుకు లైసెన్స్‌ ఇస్తోందని వారు విమర్శించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా వేదిక నేతలు పాల్గొన్నారు.

లోక్‌సభలో నీట్‌పై చర్చకు పట్టు
లోక్‌సభ సమావేశాలు ఐదోరోజు వాడీవేడిగా కొనసాగాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే టి-20 ప్రపంచ కప్‌ గెలుపొందిన టీమ్‌ ఇండియాకు ఎంపిలంతా అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించేందుకు అధికార పార్టీ నేత అనురాగ్‌ ఠాకూర్‌ను స్పీకర్‌ ఓం బిర్లా పిలిచారు. లోక్‌సభ ప్రతి పక్ష నేత రాహుల్‌గాంధీ సభలో నీట్‌ అవకతవకల అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ విషయంపై తాము వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. నీట్‌ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అందుకు స్పీకర్‌ ఓం బిర్లా నిరాకరించడంతో సభ నుంచి ప్రతిపక్ష ఎంపిలు వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ‘మేము నీట్‌పై ఒకరోజు మొత్తం చర్చను కోరుతున్నాము. ఇది చాలా ముఖ్యమైన అంశం. పేపర్‌ లీక్‌ల వల్ల రెండుకోట్ల మందికిపైగా విద్యార్థులు ప్రభావితులయ్యారు. 70 సందర్భాల్లో పేపర్‌ లీక్‌లు జరిగాయి. ఈ విషయంలో విద్యార్థులం తా ఆందోళనలో ఉన్నారు. వారికి పార్లమెంట్‌ నుంచి భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సి ఉంది. మీరు ఈ అంశంపై ప్రత్యేక చర్చకు అనుమతిస్తే మేం సంతోషిస్తాం’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.
రాహుల్‌ అభ్యర్థనను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వ్యతిరేకించారు. ఆ అంశంపై నోటీసు ఇవ్వాలని, బిఎసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమయంలో వాయిదా తీర్మానాలు తీసుకునేందుకు నిబంధనలు అంగీకరించవని అన్నారు. ప్రస్తుత సమావేశాల్లో జీరో అవర్‌, ప్రశ్నోత్తరాలు లేవని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చిద్దామని పేర్కొన్నారు. తీర్మానాన్ని ఆమోదించిన తరువాత ఇతర అంశాలను లేవనెత్తవచ్చన్న ప్రతిపక్షాల అభ్యర్థనను ఓం బిర్లా తిరస్కరించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్షాలు కోరుతున్న అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఏ అంశం చర్చించాలనే దానిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రస్తుతం చర్చను కొనసాగించాలని రాజ్‌నాధ్‌ కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ ముగించే వరకూ ప్రత్యేక చర్చ జరగదని చెప్పారు. దీంతో సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి.

➡️