అంగన్వాడీల సమ్మెపై అణచివేత ధోరణి సరైంది కాదు : ఎమ్మెల్సీ ఐవి

mlc iv anganwadi strike 5th day

మంత్రి బొత్స, ఉష శ్రీ చరణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం అణచివేయాలన్న ధోరణి సరైంది కాదని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడి వర్కర్ల నిరవధిక సమ్మెకు ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఐదేళ్లు కావస్తున్న హామీ అమలు కాలేదని దీనితో అంగన్వాడీ వర్కర్లు సమ్మెకు దిగారని ఆయన వివరించారు. సమ్మె పరిష్కారమయ్యే దిశగా అంగన్వాడి వర్కర్ల కు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సమ్మెను అణచివేయాలని, అంగన్వాడి సెంటర్ లో తాళాలు పగలగొట్టించడం వంటి చర్యలకు పూనుకోవడం సరైనది కాదని ఆయన విమర్శించారు. అదేవిధంగా మంత్రి బొత్స సత్యనారాయణ రాజ్యాంగేతర పదాలను ఉపయోగిస్తున్నారని ఉద్యమ సంఘాల నాయకులు ప్రభుత్వం కాళ్లు పట్టుకోవాలని అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని ప్రభుత్వం కాళ్లు పట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అంగన్వాడి సమస్యలను పరిష్కరించమంటే జగన్ అంగన్వాడీలను తొలగించమన్నారని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. అంగన్వాడి వర్కర్లను తొలగిస్తే వారు మిమ్మల్ని పదవుల్లోంచి తొలగివేస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల జీతాలు పెంచాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, ఎం కృష్ణవేణి, దుర్గ, కే గంగవరం రామచంద్రపురం మండలాల అంగన్వాడీ వర్కర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️