కవితకు బెయిల్‌ నిరాకరణ

Apr 8,2024 22:39 #court, #MLC Kavitha, #Telangana

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు) మధ్యంతర బెయిల్‌ నిరాకరించింది. మధ్యంతర బెయిల్‌పై ఇడి చేసిన అభ్యంతరాలు, కోర్టులో పేర్కొన్న ఆధారాలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పిల్లల పరీక్షలకు సంబంధించిన ఆందోళనను పరిష్కరించడానికి తల్లినే సరైన ప్రత్యామ్నాయం అన్న ‘బలవంతపు కారణం’తో కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేమని అభిప్రాయపడింది. అలాగే సెక్షన్‌ 45 (1) అనేది మైనర్లు, అమాయకులు, పలు నేరాల్లో బలిపశువులు, మోసపోయిన మహిళకు వర్తిస్తుందని, కానీ కవిత లాంటి ఉన్నత విద్యావంతురాలు ఈ కేసులో బలిపశువు అయినట్లు భావించడం లేదని పేర్కొంది. మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయంలో స్కామ్‌లో కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలు, ఆమె ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరమని పేర్కొంది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై తీహార్‌ జైళ్లో ఉన్న కవిత.. తన చిన్న కొడుకుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో తనకు అండగా ఉండేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ట్రయల్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

➡️