బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం : ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎం.వి.ఎస్‌.శర్మ

ప్రజాశక్తి – విజయవాడ : కార్పొరేట్‌ శక్తులతో జతకట్టిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎం.వి.ఎస్‌.శర్మ అన్నారు. ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్లు కుంభకోణానికి పాల్పడిన బిజెపి…. ఈ విషయాలను ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. చివరికి మీడియాను సైతం బెదిరించి తన గుప్పిట్లో పెట్టుకుందని, ఇది ప్రజాస్వామ్యానికి అంత్యంత ప్రమాదకరమని తెలిపారు. మార్క్సిస్టు సిద్ధాంతకర్త, స్వాతంత్య్ర సమరయోధులు మాకినేని బసవపున్నయ్య 32వ వర్థంతి సందర్భంగా విజయవాడలోని బాలోత్సవ్‌ భవనల్లో ‘ప్రజాస్వామ్యం – కార్పొరేట్లు- ఎన్నికల బాండ్లు’ అన్న అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఎంబివికె ట్రస్ట్‌ చైర్మన్‌ పి.మధు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శర్మ మాట్లాడుతూ.. బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థలకు పెనుప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన రూ.36 వేల కోట్ల యుద్ధ విమానాల కుంభకోణం, బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కార్పొరేట్‌ సంస్థల యజమానులకు రూ.11 లక్షల కోట్ల రుణాల మాఫీ, రూ.64 కోట్ల బోఫోర్స్‌ కుంభకోణం, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ద్వారా రూ.12 లక్షల కోట్ల దోపిడీ… ఇలా అనేక రూపాల్లో ప్రజల డబ్బును ప్రభుత్వాల అండతో దేశ, విదేశీ బడా కార్పొరేట్లు కొల్లగొట్టారన్నారు. గత పదేళ్లలో అంతకు పదిరేట్ల వరకు ఎన్నికల బాండ్లు తదితర రూపాల్లో కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. దేశానికి ప్రజాస్వామ్యం పనికి రాదని, నియంతృత్వ పాలన బాగుటుందేమో అనే స్థాయికి కొందరు మేధావులు, మధ్య తరగతి ప్రజలు రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. పదేళ్ల మోడీ పాలన అప్రకటిత ఎమర్జెన్సీని, నయా ఫాసిజాన్ని తలపిస్తోందన్నారు. పీకల్లోతు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన బిజెపి ప్రభుత్వం.. తన పాపాలను మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా పంచేలా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల బాండ్ల కుంభకోణమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఎన్నికల బాండ్లను మొదటి నుంచీ సిపిఎం, ఇతర కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయన్నారు. సిపిఎం చెప్పినట్లుగానే సుప్రీంకోర్టు స్పందించిందని తెలిపారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యానికి ఎన్నికల బాండ్లు విఘాతం కలిగిస్తాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు, మతోన్మాద ప్రమాదం, ధరలు, నిరుద్యోగం, ప్రజల స్థితిగతుల గురించి వైసిపి, టిడిపి, జనసేన పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె బాధ్యులు యువి రామరాజు పాల్గొన్నారు. పిఎన్‌ఎం కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.

➡️