మోడీ హఠావో – దేశ్‌కి బచావో : 30న మేధో మధనం సదస్సు

  • భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మోడీ హఠావో..దేశ్‌కి బచావో …’నినాదంతో ఈ నెల 30న మేధోమధనం సదస్సు నిర్వహించాలని భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిర్ణయించింది. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలంతా కదలిరావాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మోడీ హఠావో- దేశ్‌కి బచావో పేరుతో డిశంబర్‌ 30న మేధోమదనం సదస్సును నిర్విహించాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భిన్న మతాలు, కులాలు, భిన్న సంస్కృతి, సాంప్రాదాయాలు కలిగిన దేశ ప్రజల మద్య మతోన్మాదంతో విద్వేషాన్ని పెంచుతూ కార్పోరేట్‌లకు సంపదను దోచి పెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలంతా సమాయత్తం కావాలంటూ పిలుపునిచ్చిన ఈ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్బంగా కిసాన్‌ సంయుక్త మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజులు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పదేళ్లకాలంలో అదాని, అంబానీల కోసం బరితెగించి పనిచేస్తోంది తప్ప రైతులు, కార్మికులు, ఉద్యోగులు, సామాన్య ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ఇప్పటికే రైల్వేలు, ఓడరేవులు, ఎల్‌ఐసి, విమానయానం, జాతీయరహదారులు, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు చిన్న పిల్లలు ఆడుకునే మైదానాలను కూడా కార్పోరేట్‌లకు కట్టబెట్టిందని అన్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక, హోదా, రైల్వే జోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, రాజధాని నిర్మాణం ఇలా అన్నింటిలో మోఢ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు.. కర్నాటకలో మేలుకో కర్నాటక పేరుతో బిజెపిని గద్దె దించినట్లే రాష్ట్రంలో కూడా మేలుకో ఆంధ్రుడా పేరుతో బిజెపిని దానికి మద్దతు ఇస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మతోన్మాద బిజెపిని గద్దె దించేందుకు ఈ నెల 30న విజయవాడలోని సిద్దార్థ కళాశాల ఆవరణలో జరిగే మేధోమధనం సదస్సుకు రాష్ట్రంలోని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు, మేధావులు ప్రజాతంత్ర వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాదనసమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు, ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగ్‌రావు, రిటైర్ట్‌ ఐఎఎస్‌ అధికారి బండి శ్రీనివాస్‌, రైతు సంఘం నాయకులు కెవివి ప్రసాద్‌, కౌలురైతు సంఘం నాయకులు పి జమలయ్య, భారత్‌ బచావో నాయకులు భాస్కర్‌రావు, మేలుకో ఆంధ్రుడు నాయకులు రమేష్‌ పట్నాయక్‌, రైతు కూలీ సంఘం నాయకులు ఝాన్సీ, ఐఎఫ్‌టియు నాయకులు పొలారి తదితరులు పాల్గొన్నారు.

➡️