విభజించి పాలిస్తున్న మోడీ

Dec 16,2023 09:06 #dividing, #PM Modi, #ruling
  • అష్టకష్టాలు పడుతున్నది రైతులు, కార్మికులే
  • బిజెపి సర్కారును గద్దె దించాల్సిందే
  • జగన్‌ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన తరుణం
  • ఎఐకెఎస్‌ బహిరంగ సభలో వక్తల పిలుపు
  • కర్నూలులో ఉత్తేజంగా రైతు ర్యాలీ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- కర్నూలు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను విభజించి పాలిస్తోందని, దీనివల్ల నష్టపోతున్నది, అష్టకష్టాలు పడుతున్నది కార్మికులు, కర్షకులేనని, మోడీ ప్రభుత్వాన్ని దించాల్సిన ఆవశ్యకత కార్మికులు, కర్షకులకే ఉందని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన బహిరంగసభలో వక్తలు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజా అనుకూల ప్రభుత్వం కోసం రైతులు, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని దిశా నిర్దేశం చేశారు. రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తున్న రాష్ట్రంలోని జగన్‌ సర్కారుపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎఐకెఎస్‌ ఆలిండియా కౌన్సిల్‌ సమావేశాలను పురస్కరించుకొని ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు ఓల్డ్‌ సిటీ అంబేద్కర్‌ విగ్రహ కూడలిలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు కొత్త బస్‌స్టాండ్‌ సుందరయ్య సర్కిల్‌ నుంచి సభాస్థలి వరకు ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో రైతులు, వ్యవసాయ కార్మికులు ఎర్ర జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘రైతు రక్షణకు మోడీని గద్దె దించాలి. రైతును రక్షించాలి. దేశాన్ని కాపాడాలి’ అంటూ నినదించారు. బహిరంగ సభకు ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు.

రైతాంగ పోరాటాలు అవసరం

పదేళ్ల మోడీ జమానాలో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే తెలిపారు. ‘అంతమంది రైతులు ఎందుకు చనిపోయారు? పంటలకు కనీస మద్దతు ధర రాక నష్టాలు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. క్వింటాలు వరి ధాన్యానికి ప్రకటించిన ఎంఎస్‌పి రూ.2,160. ఎక్కడా 1,600 కూడా రావట్లేదు. అదే కేరళ వామపక్ష ప్రభుత్వం 2,850 ఇస్తోంది. మోడీ ప్రభుత్వానికి, జగన్‌ సర్కారుకు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌ విసురుతున్నా. కేరళలో మాదిరి ధర ఇవ్వగలుగుతారా? ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగ పోరాటాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగునాట అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటం, సుందరయ్య నాయకత్వాన సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రైతులు ఉద్యమించాలి’ అని అన్నారు.

వరల్డ్‌ కప్‌ గతే : విజూ కృష్ణన్‌

రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ సర్కారు పదేళ్లల్లో సంక్షోభంలోకి నెట్టిందని ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన మహోద్యమం, 56 అంగుళాల ఛాతి ఉన్న తనకు ఎదురే లేదని విర్రవీగిన మోడీ మెడలు వంచిందని వివరించారు. ‘మోడీ ప్రభుత్వం అప్పుడే ఓడిపోయింది. శత్రువు గుండెల్లో రైతు పోరాటం భయాన్ని నాటితే మిత్రుల గుండెల్లో ఉత్సాహం నింపింది. వరల్డ్‌ కప్‌లో సెమీఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లూ గెలిచిన ఇండియా జట్టు ఫైనల్‌లో ఓడింది. బిజెపి, మోడీ పరిస్థితి కూడా అంతే.

అబద్దాల్లో నెంబర్‌ వన్‌ : హన్నన్‌ మొల్లా

అబద్దాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో మోడీ, బిజెపి నంబర్‌ వన్‌గా ఉన్నారని ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా విమర్శించారు. దేశ భద్రత తమకు ముఖ్యమని మోడీ చెబుతుండగా, పార్లమెంట్‌లోకి దుండగులు ప్రవేశించారని, దీనిపై ప్రధాని ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు మోడీకి పట్టవన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వీరోచితంగా పోరాడి మోడీ చొక్కా పట్టుకొని రద్దు చేయించుకున్నారని గుర్తు చేశారు. కార్మికులు, రైతులు కలిసి సమరశీల పోరాటాలు నిర్వహించాలని కోరారు. రాయలసీమలో తీవ్ర కరువుతో రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు అల్లాడుతున్నారని, పనుల కోసం వలస పోతున్నారని, రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే సిఎం జగన్‌కు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. సభకు అధ్యక్షత వహించిన వి.కృష్ణయ్య మాట్లాడుతూ రైతులేం చేస్తున్నారు, వారి పరిస్థితేంటి అని చర్చించేందుకు కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ఎఐకెఎస్‌ మద్దతు తెలుపుతూ తీర్మానించిందని తెలిపారు. ఈ నెల 21న అన్ని గ్రామాల్లో రైతు సమస్యలపై వినతి పత్రాలివ్వాలన్నారు. ఎపి రైతు సంఘం కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కరువు జిల్లా కర్నూలు అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుల కష్టనష్టాలపై ఏ ప్రభుత్వమూ దృష్టి పెట్టలేదన్నారు. పంట నష్టపోయిన రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎఐకెఎస్‌ నాయకులు కె.కృష్ణప్రసాద్‌, టి.సాగర్‌, వై.కేశవరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిఐటియు నాయకులు సభా వేదికపై ఆశీనులయ్యారు. తొలుత ఎపి రైతు సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. కళా ప్రదర్శనలు ఇచ్చారు.

కదం తొక్కిన కర్షకులు

ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (కెఐకెఎస్‌) జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా కర్నూలు నగరంలో వేలాది మంది రైతులతో శుక్రవారం భారీ ప్రదర్శన జరిగింది. రైతులకు సంఘీభావంగా రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు ముందుభాగాన కవాతు చేశారు. కర్నూలు నగరం కొత్తబస్టాండు సమీపంలోని సుందరయ్య సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన శ్రీరామ్‌ థియేటర్‌, మౌర్యఇన్‌, రాజ్‌ విహార్‌ సెంటర్‌, కిడ్స్‌ వరల్డ్‌, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి సర్కిల్‌ మీదుగా పాత బస్టాండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజ్జూ కృష్ణన్‌ తదితరులు ప్రదర్శన అగ్రభాగాన నిలిచి ముందుకు నడిపించారు. ప్రదర్శన ముందు భాగాన స్వాగతం పలుకుతూ ఎపి డప్పు కళాకారుల సంఘం డబ్బుల దరువు నృత్యంతో చూపరులను ఆకట్టుకుంది. వెంకటేష్‌ థియేటర్‌ సమీపంలో యుటిఎఫ్‌ నాయకులు సంఘీభావాన్ని తెలుపుతూ పూల వర్షంతో ప్రదర్శనకు స్వాగతం పలికారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా స్ఫూర్తిని నింపేలా ప్రదర్శన సాగింది.

➡️