ఓట్లు తారుమారుకు మోడీ యత్నాలు! 

May 26,2024 08:04 #cpm, #cpm v srinivasarao, #press meet
  • ప్రజాస్వామ్యం పట్ల ఓటర్లలో ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత కల్పించాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి జిల్లా) : ఈ ఎన్నికల్లో మోడీ ఎలాగైనా గెలవాలని ఎన్నికల కమిషన్‌ను గుప్పిట్లో పెట్టుకుని దాని ద్వారా ఏదోరకంగా తారుమారు (మానిప్యులేట్‌) చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరులో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్‌ జరిగేలోపు చాలా ప్రమాదకరమైన ఘటనలు జరిగే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కొన్ని సెలెక్టివ్‌ బూత్‌లు, నియోజకవర్గాల్లో మోడీ గెలుపు కోసం ఈ తారుమారు ప్రయత్నాలు చేసి మెజారిటీ సాధించడానికి కుట్ర చేస్తున్నారని, దీనికి ఎన్నికల కమిషన్‌ సహాయం చేస్తుండడం అభ్యంతరకరమైన విషయమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగిన బూత్‌ల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో వివరాలతో సహా ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే తాము ఇవ్వలేమని, ఇస్తే ఏదో జరిగిపోతుందని ఎన్నికల కమిషన్‌ చెప్పడం చాలా అన్యాయమని అన్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఉద్యోగులు హక్కుల కోసం పోరాడితే నిర్బంధాలు ప్రయోగించే పోలీసులు… నేడు ఓటింగ్‌ యంత్రాలను ధ్వంసం చేస్తున్న వారిని కనీసం పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇది అసమర్థత కాదని ఉద్దేశపూర్వకమేనని పేర్కొన్నారు. పోలింగ్‌ సమయంలో చెక్‌పోస్టులు కూడా సక్రమంగా పనిచేయలేదని విమర్శించారు. మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకున్నారంటే పోలీసుల సహకారం లేకుండా సాధ్యం కాదన్నారు. ఇప్పుడు సులభంగా బెయిల్‌ కూడా తెచ్చేసుకున్నారని తెలిపారు. ఓటర్ల ప్రాథమిక హక్కులు హరించేశారని, డబ్బు పంచిన అభ్యర్థులను, రాజకీయ వ్యక్తులను విచ్చలవిడిగా వదిలేశారని, ఒక్కరిపైనైనా కేసులు లేవని, అరెస్టులూ చేయలేదని విమర్శించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయల చలామణిని, డబ్బు పంచిపెట్టిన అభ్యర్థులను స్వేచ్ఛగా వదిలేశారని, ఇదేనా ఎన్నికల కమిషన్‌ సమర్థత అని ప్రశ్నించారు. తమలాంటి ప్రచారం చేసుకునే పార్టీలకు మాత్రం అనుమతులు ఇవ్వకుండా, జెండాలు కట్టనివ్వకుండా, చివరికి కళాకారులు డ్రెస్సులను కూడా పట్టుకుని కేసులు పెట్టారని వివరించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్‌ పారదర్శకతతో వ్యవహరించి అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, తారుమారు కుట్రలను నిరోధించాలని, బూత్‌ల వారీ పోలింగ్‌ వివరాలను వెల్లడించి ఓటర్లకు ప్రజాస్వామ్యంపై విశ్వసనీయత కల్పించాలని కోరారు.

జూన్‌లోగా పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ
పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీలను జూన్‌ 4వ తేదీలోగా అమలు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పునరావాసం కోసం అనేక ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్న పోలవరం నిర్వాసితులపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న పాలకుల తీరును విమర్శించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రాకపోవడంతో దేవీపట్నం మండలానికి చెందిన రైతు సీతారామయ్య ధవళేశ్వరం వద్ద ఆత్మహత్యకు పాల్పడి ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చావు బతుకుల్లో ఉన్నారని తెలిపారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాసితులకు ప్రకటించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలను, పునరావాసాన్ని తక్షణమే కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మళ్లీ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, అల్లూరి జిల్లా కార్యదర్శి అప్పలనర్స, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ పాల్గొన్నారు.

➡️