భూ సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం

Jun 28,2024 22:35 #land issue, #movement

– దాడిచేసిన పెత్తందారులపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం
– పోలీసుల సమక్షంలో చర్చలు – పరిష్కారానికి అధికారుల హామీ
ప్రజాశక్తి – గరుగుబిల్లి (పార్వతీపురం మన్యం జిల్లా):పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని శివ్వాం గ్రామం దళితులకు చెందిన భూములను పెత్తందారులు ఆక్రమించుకునేందుకు గత అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే గురువారం దళితులు సాగు చేస్తున్న భూముల వద్దకు వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారని సిపిఎం నాయకులు ఎం.కృష్ణమూర్తి, వై.మన్మధరావు, బివి రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు అన్నారు. శుక్రవారం శివ్వాం దళితుల భూ సమస్యపై మండల తహశీల్దార్‌ జయ, పాలకొండ డిఎస్‌పి కృష్ణారావు, సిఐ మంగరాజు, ఎస్‌ఐ అమ్మన్నరావు ఆధ్వర్యంలో బాధితులతో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. 1970లో ప్రభుత్వం శివ్వాం గ్రామంలోని 14 దళిత కుటుంబాలకు సర్వే నెంబర్లు 20, 21, 23 ,26, 29, 30 లలో 22 ఎకరాల 80 సెంట్లకు డి-పట్టాలు మంజూరు చేసిందని, అప్పటినుంచి దళితులు ఆ భూములను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే శివ్వాం గ్రామానికి చెందిన కొంతమంది బిసి వ్యక్తులు సర్వేనెంబర్‌ 102లోని భూమికి కోర్టు ద్వారా ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చి ఆ ఆర్డర్‌ ఈ దళితుల భూములపై తెచ్చినట్లు అధికారులను నమ్మబలికించి వారిని వెళ్లగొట్టారని వివరించారు. దళితులకు సదరు భూములు అప్పగించాలని, ఇతరులను ఆ భూమిలోకి రాకుండా నిరోధించాలని, ఆక్రమణలకు పాల్పడుతున్న పెత్తందారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ జయ, డిఎస్‌పి కృష్ణారావు స్పందిస్తూ.. శివ్వాం దళితుల భూ సమస్య న్యాయమైనదని, ఈ సమస్య పరిష్కారానికి కొద్దిరోజుల్లోనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులతో పాటు బాధితులు పాల్గొన్నారు.

➡️