పోస్టు కార్డుల ఉద్యమం

  • సిఎంకు పోస్టుకార్డు ద్వారా సమస్యల గ్రీటింగ్‌
  • 13వ రోజూ కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం : సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు సోమవారం పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగన్‌ బొమ్మలను చిత్రీకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్టుకార్డులను పోస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరింది. పలువురు వక్తలు మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజు అయినా ఉద్యోగులు కుటుంబాలతో సంతోషంగా గడపకుండా నిరవధిక సమ్మె శిబిరంలో కూర్చునే దుస్థితి ముఖ్యమంత్రి కల్పించారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. విజయనగరంలోని సమ్మె శిబిరంలో జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి కాంతారావు మాట్లాడుతూ మంత్రి బొత్స చర్చలు జరిపి ఎటువంటి పరిష్కారమూ చూపకుండా సమ్మెను విరమించాలని కోరడం సరికాదన్నారు. తాము ప్రభుత్వాన్ని కొత్తగా ఏమీ అడగలేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ వేతనాలు, రెగ్యులరైజేషన్‌ గురించి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని సమగ్ర శిక్ష ఉద్యోగుల జెఎసి రాష్ట్ర చైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపి మాట్లాడారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు. మంత్రులు కమిటీతో చర్చలకు పిలిచి పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం పథకం రూపొందిస్తుందని, అందుకే అన్ని విభాగాల ఉద్యోగులు ఐక్యంగా ఉండి పోరాడాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ కిషోర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎం వాగ్దేవి, ఎపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి, కర్నూలు జిల్లా, చిత్తూరు, తిరుపతి, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో, కృష్ణా జిల్లా, ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అనకాపల్లి జిల్లాల్లో సమ్మె శిబిరాల్లో నిరసన తెలిపారు.

➡️