బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం : యుటిఎఫ్‌ 

Jan 12,2024 10:06 #movement, #utf
  • నిరసన కార్యక్రమాలకు యుటిఎఫ్‌ పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని యుటిఎఫ్‌ వెల్లడించింది. ఈ మేరకు ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.18 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని తాము చేపట్టిన 36 గంటల దీక్షను అప్రజాస్వామికంగా ప్రభుత్వం భగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కనీసం ప్రభుత్వం ప్రకటించలేదని పేర్కొన్నారు. ప్రతినెలా ఒకటిన వేతనాలు చెల్లించాలని, పిఆర్‌సి, డిఎలు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సరెండర్‌ లీవులు తదితర బకాయిలు చెల్లించాలని పలుమార్లు కలిసి వినతిపత్రాలిచ్చా మన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖ అధికారులకు, మంత్రివర్గ ఉపసంఘంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న విద్యాశాఖ మంత్రికి ముందస్తుగా నోటీసులిచ్చి తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో ధర్నాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో 9, 10 తేదీల్లో 36 గంటల ధర్నా చేపట్టామని గుర్తుచేశారు. ప్రశాంత వాతావరణంలో ధర్నా చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోగా, ఉపాధ్యాయులందరికీ నోటీసులు జారీ చేసి జిల్లాల్లో ఉపాధ్యాయులను నిర్బంధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడకు తరలివచ్చిన వందల మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి అప్రజాస్వామికంగా పోరాటం అణచివేశారని పేర్కొన్నారు. తమ పోరాటానికి కొనసాగింపుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న బోగి మంటల్లో దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. 19న అన్ని పట్టణాలు, తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, జిల్లా కేంద్రాల్లో 24న నిర్వహించాలని కోరారు. 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

➡️