రఘురామ కృష్ణంరాజు రాజీనామా – సిఎం జగన్‌కు లేఖ

ప్రజాశక్తి – భీమవరం :నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసిపికి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లేఖలో ముఖ్యమంత్రిపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ తన పట్ల గజినీలా వ్యవహరించారని, అనర్హత వేటు వేయాలని ఎంతో ప్రయత్నం చేశారని, ఏమీ ఫలించలేదని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో మనమిద్దరం తేల్చుకునే సమయం ఆసన్నమైందంటూ ఘాటుగా విమర్శించారు. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి వైసిపి తరపున రఘు రామకృష్ణంరాజు పోటీ చేసి గెలుపొందారు. కొన్నాళ్ల తర్వాత వైసిపి నుంచి విభేదానికి గురైన ఆయన రెబల్‌ ఎంపిగా మారి ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి జగన్‌పై ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో రఘురామను సొంత గడ్డపై అడుగుపెట్టనీయకుండా సామ, దాన దండోపాయాలను వైసిపి ప్రయోగించింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల పాటు ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి వచ్చారు. దీనిలో భాగంగా తాను వైసిపికి ఫిబ్రవరిలో రాజీనామా చేస్తానని అప్పట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసిపికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.

➡️