ఎండియు వాహనాలతో ఇంటింటికీ రేషన్‌ వైపే ఆదివాసీల మొగ్గు

-డిఆర్‌ డిపోల ద్వారా ఇస్తే తిప్పలు తప్పవని ఆవేదన
-నడక ప్రయాస, మోతభారం మా కొద్దని వేడుకోలు
ప్రజాశక్తి- పాడేరు, డుంబ్రిగుడ, అరకు, విఆర్‌.పురం విలేకరులు (అల్లూరి జిల్లా) :రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ విధానానికి స్వస్తి చెప్పి అంతకుముందు మాదిరిగా డిఆర్‌ డిపోల ద్వారా రేషన్‌ సరఫరా చేయడానికి తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజన ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో రేషన్‌ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి దాపురించిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వ నిర్ణయంమై జిల్లాలోని పలు మండలాల్లో ‘ప్రజాశక్తి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. పలువురి అభిప్రాయాలు సేకరించింది. ఇంటింటికీ రేషన్‌ సరఫరా వల్ల గ్రామాల్లో గిరిజనులకు సౌలభ్యంగా ఉందని పలువురు తెలిపారు. గతంలో డిఆర్‌ డిపోల ద్వారా రేషన్‌ సరఫరా చేసినప్పుడు తమ గ్రామాల నుంచి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు వెళ్లి కాలినడకన రేషన్‌ సరుకులు మోసుకుని తెచ్చుకునేవారిమని వారు గుర్తుచేసుకున్నారు.
గత వైసిపి ప్రభుత్వం రేషన్‌ సరుకుల సరఫరాకు 2021 నుంచి ఎండియు వాహనాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో ఉన్న 2,98,092 మంది రేషన్‌ కార్డుదారులకు 221 మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్స్‌ (ఎండియు) వాహనాల ద్వారా రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉన్న గ్రామాలకు వెళ్లి రేషన్‌ సరుకులు అందించేవారు. దీంతో, లబ్ధిదారులకు డిపోలకు వెళ్లి సరుకులు తెచ్చుకునే యాతన తప్పింది. డిఆర్‌ డిపోల ద్వారా రేషన్‌ ఇస్తే మళ్లీ తమ కష్టాలు మళ్లీ మొదటికే వస్తాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. డుంబ్రిగుడ డిఆర్‌ డిపో పెదపాడు, అంత్రిగూడ గ్రామాలకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ, పామురాయి, గొడసారు గ్రామాలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ గ్రామాల వారు డిఆర్‌ డిపోకు వచ్చి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గుంటగన్నెల పంచాయతీ జాంగుడ డిఆర్‌ డిపో పరిధిలో కబడబోడ్డాపుట్టు గ్రామం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి వారు కాలినడకన డిపోకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. రంపచోడవరం డివిజన్‌లోని విఆర్‌.పురం మండల వాసులు ఎండియు వాహనం ద్వారానే ఇంటికి తెచ్చి రేషన్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ మండలంలోని శ్రీరామగిరి పంచాయతీ పరిధి చొక్కానపల్లి గ్రామవాసులు, విఆర్‌.పురం బిసి కాలనీ ప్రజలు ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ ఇచ్చే పద్ధతినే బాగుందని చెబుతున్నారు. ఆ మండలంలోని కొటారుగొమ్ము, మొలకనపల్లి, అడివి వెంకన్నగూడెం, దుర్బలంక, రామవరం, ధర్మతాలగూడెం, వడ్డిగూడెం, సీతంపేట, సున్నంవారిగూడెం. వెంకంపాలెం తదితర గ్రామాలవారిదీ అదే మాట. ఎండియు వాహనాలను తీసేస్తే తాము రెండు నుంచి ఐదు కిలోమీటర్ల మేర వెళ్లి రేషన్‌ తెచ్చుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
డిపోల్లో ఇస్తే ఆటోపెట్టి రేషన్‌ తెచ్చుకోవాలి
మా ఇంట్లో వారిమంతా కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీరామగిరికి వెళ్లి అక్కడి డిపోలో రేషన్‌ తెచ్చుకోవాలంటే కష్టమైన పని. ఆటోలోపోయి తెచ్చుకుంటే నలభై రూపాయలు ఖర్చవుతుంది. మా పరిస్థితిని అర్థం చేసుకుని మునుపటిలా ఇంటి వద్దకే తెచ్చి రేషన్‌ ఇవ్వాలి.
– రవణమ్మ, చొక్కానపల్లి గ్రామం,
శ్రీరామగిరి పంచాయతీ, విఆర్‌.పురం మండలం

మూడు కిలోమీటర్లు నడవాలి
మా గ్రామానికి జాంగుడ డిఆర్‌ డిపో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. బియ్యం తీసుకోవడానికి నడిచి వెళ్లి, తిరిగి రావాలంటే కష్టమైన పని. ఎండియు వాహనం ద్వారా ఇంటి వద్దకే బియ్యం తెచ్చి ఇవ్వాలి.
– జి.నాగేశ్వరరావు, కబడబోడ్డాపుట్టు గ్రామం, జాంగుడ డిపో పరిధి, డుంబ్రిగుడ మండలం

వ్యాన్‌ ద్వారా సరుకులు బాగానే అందుతున్నాయి
మా గ్రామానికి వ్యాన్‌ ద్వారా సరుకులు బాగానే అందుతున్నాయి. మా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని డోకులూరు గ్రామంలోగల డిఆర్‌ డిపోకు వెళ్లి రావాలంటే రెండు గంటల సమయం పడుతుంది. నడిచి వెళ్లి తలపై బియ్యం మోసుకురావడమంటే కష్టమే.
– కిల్లో ముత్తమ్మ, మర్రిపాలెం గ్రామం, డోకులూరు పంచాయతీ, పాడేరు మండలం

➡️