పురుగులు ఇంట్లోకి రాకుండా …

Jun 30,2024 04:20 #jeevana

వర్షాకాలంలో పురుగులు, బొద్దింకలు, చిన్న చిన్న కీటకాల సమస్య విపరీతంగా ఉంటుంది. వర్షం పడ్డ వెంటనే పరిసరాల్లో నీరు నిలిచి బురదగా మారుతుంది. దీంతో దోమలు, కీటకాలు వృద్ధి చెందుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి ఇంటి లోపలకు వచ్చేస్తాయి. కొన్ని చిట్కాలు పాటించి ఇంట్లోకి పురుగులు రాకుండా కాపాడుకోవచ్చు.

  • మామూలుగా ఇంటి బయట తెలుపు రంగు కాంతి వచ్చే బల్బులను వాడతాం. వాటికి పురుగులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి.
  • బదులుగా ఎరుపు రంగు లేదా పసుపు రంగు వెలుతురు నిచ్చే బల్బులను అమర్చాలి. వీటికి పురుగులు అంతగా రావు.
  • అలాగే బయట వీలైనంత తక్కువ సేపు లైట్లు వేసి ఉంచాలి. వీలైతే మోషన్‌ డిటెక్టివ్‌ లైట్లు వాడాలి. వీటివల్ల సగం సమస్య తగ్గుతుంది.సిట్రోనెల్లా ఒక గడ్డిజాతి మొక్క. దీనికి సహజంగానే పురుగులను వికర్షించే లక్షణం ఉంటుంది. కాబట్టి సిట్రోనెల్లా నూనెను చల్లడం వల్ల పురుగులు రాకుండా చేయొచ్చు. మార్కెట్లో ఇది లభ్యం అవుతుంది. లేదంటే సిట్రోనెల్లా వాసన ఉండే క్యాండిళ్లు ఇంట్లో వెలిగించినా ఆ వాసనకు పురుగులు రావు.
  • ఇంట్లో లేదా కిచెన్‌లో కొన్ని సహజంగా కీటకాలను తరిమికొట్టే మొక్కల్ని పెట్టుకోవాలి.
    తులసి, ల్యావెండర్‌, కలబంద, నిమ్మగడ్డి, రోజ్మేరీ, పుదీనా.. లాంటి మొక్కల్ని ఒక మూలన పెట్టుకుంటే చిన్ని చిన్న దోమల్లాంటి కీటకాలు రావు.వంటల మీద, పండ్లు, కూరగాయల మీద, డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టిన వస్తువుల మీద చిన్న చిన్న పురుగులు వచ్చి వాలుతుంటాయి. అలాంటప్పుడు వాటి మీద జాలీ లాంటిది పెట్టొచ్చు.
  • ఆన్‌లైన్‌లో మెటల్‌ మెష్‌ బాస్కెట్లు, మెష్‌ క్యాప్‌ దొరుకుతాయి. వాటిని వాడితే ఏ ఇబ్బందీ ఉండదు.
    లైట్లకు కీటకాలు ఆకర్షించి ఎక్కువవుతాయి. కాబట్టి లైట్ల కింద నూనెలో ముంచిన కాగితాన్ని లేదా న్యూస్‌ పేపర్‌ వేలాడదీయాలి లేదా అతికించాలి. దీంతో కొన్ని పురుగులు ఆ కాగితానికి అతుక్కుపోతాయి. పురుగులు ఎక్కువగా లేనప్పుడు, చాలా చిన్న చిన్న పురుగులతో ఇబ్బంది ఉంటే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
  • దోమలు, పురుగులు రాకుండా గది మూలల్లో కర్పూరం వెలిగించొచ్చు. రెండు మూడు కర్పూర బిళ్లలు ప్లేట్‌ లో పెట్టి వెలిగించి కనీసం పది నిమిషాలు అలా వదిలేయాలి. గది తలుపులు మూసి ఉంచాలి. దాంతో దోమలు కాస్త తగ్గుతాయి.
    నీలగిరి నూనె, నిమ్మనూనె, ల్యావెండర్‌ నూనె, పెప్పర్‌ మింట్‌ నూనెతో సమస్య ఎక్కువున్న చోట స్ప్రే చేస్తే పురుగులు రావు.
➡️