‘మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు’

Mar 1,2024 08:26 #JanaSena, #Mudragada, #pavan kalyan
mudragada padmanabham letter to pavan kalyan

– ఎన్నో చోట్ల అనుమతులు తీసుకోవాలి

– పవన్‌కల్యాణ్‌పై ముద్రగడ ఘాటు విమర్శలు

– జనసేనానికి పద్మనాభం బహిరంగ లేఖ

ప్రజాశక్తి – కిర్లంపూడి(కాకినాడ జిల్లా):’మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు.. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి’ అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు జనసేనానికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఏ కోరికలూ లేకుండా పవన్‌తో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానని, పలుమార్లు కిర్లంపూడి వస్తానని చెప్పి రాకపోవడానికి కొందరు అనుమతులు ఇవ్వకపోవడమేనని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయడానికి, ఎటువంటి ఫలితం ఆశించకుండా కలిసి సేవచేయడానికి జనసేనలో చేరాలని అనుకున్నానన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టిడిపి కేడర్‌ భయపడి ఇళ్లకే పరిమితమైందని తెలిపారు. ఆ సమయంలో జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడమనేది సామాన్యమైన విషయం కాదన్నారు. రాష్ట్ర ప్రజలు జనసేనను ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు. పొత్తులో భాగంగా 80 సీట్లు, రెండేళ్లపాటు సిఎం పదవిని కోరి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పవన్‌ ఆ సాహసం చేయలేకపోవడం బాధాకరమని లేఖలో వివరించారు. మీలాగ గ్లామర్‌ ఉన్న వాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవ్వడం వల్లే పవన్‌ దఅష్టిలో తాను లాస్ట్‌ గ్రేడ్‌ వ్యక్తిగా… తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా ఉండిపోయాను అని తెలిపారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

➡️