26 నుంచి సమ్మెలోకి మున్సిపల్‌ కార్మికులు 

Dec 21,2023 09:37 #municipal workers, #strike
municial workers strike notice

ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు నాలుగున్నరేళ్లు దాటినా పరిష్కారం చూపనందున తక్షణం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మెలోకి పోతున్నట్లు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తెలిపింది. మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనే డిమాండ్‌తో తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపింది. బుధవారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, కార్యదర్శి బి ముత్యాలరావు, కోశాధికారి ఎస్‌ జ్యోతిబసు, రాష్ట్ర నాయకులు జి కృష్ణవేణి, టి తిరుపతమ్మ సమ్మె డిమాండ్ల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె ఉమామహేశ్వరరావు, నాయకులు జ్యోతిబసు, ముత్యాలరావుతో కలిసి మాట్లాడారు. అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆరు నెలల్లో రెగ్యులర్‌ చేస్తామని, వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తామని సిఎం జగన్‌ హామీ ఇచ్చారని అన్నారు. నాలుగున్నరేళ్లుగా మున్సిపల్‌ కార్మికులు హామీలను అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలో పారిశుధ్యం, ఇంజినీరింగ్‌ విభాగం, క్లాప్‌ డ్రైవర్లు దాదాపు 46 వేలమంది కనీస వేతనాలకు నోచుకోకుండా వెట్టిచాకిరీ చేస్తున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు వున్నా అమలు చేయడం లేదన్నారు. 11వ పిఆర్‌సి కమిషన్‌ సిఫార్సులను కూడా అమలు చేయకుండా ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులను మోసం చేసిందని విమర్శించారు. అలాగే మున్సిపల్‌ కార్మికులకు ఇవ్వాల్సిన అలవెన్స్‌లను ఇవ్వడం లేదని తెలిపారు. ఆప్కాస్‌లో వున్న ఉద్యోగులకు రిటైర్డు అయ్యాక ఎలాంటి బెనిఫెట్స్‌ చెల్లించకుండా ఇంటికి పంపుతున్నారని అన్నారు. మున్సిపల్‌ కార్మికులందరికీ గ్రాట్యూటీ ఇవ్వాలని కోరారు. అలాగే 2024లో జరిగే ఎన్నికలకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాయబారాలు, ధర్నాలు, ప్రదర్శనలు, కలెక్టరేట్‌ల ముట్టడి లాంటి నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లినా స్పందించనందునే తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్తున్నామని తెలిపారు. న్యాయమైన డిమాండ్‌ల పరిష్కారానికి తాము చేసే పోరాటాలకు ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ కార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️