మున్సిపల్‌ కార్మికుల సమ్మె న్యాయ సమ్మతం

Jan 8,2024 08:06 #BV Raghavulu, #speech

– సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

– సమ్మెకు సంపూర్ణ మద్దతు

– రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సమాన పనికి సమాన వేతనం కోసం మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయ సమ్మతమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం ఉదయం ధర్నా చౌక్లో జరుగుతున్న ధర్నాకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. రూ.వేలకోట్లు అప్పులు చేస్తున్నా.. కార్మికుల వేతనాలు పెంచే విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని ప్రశ్నించారు. కార్మికుల డిమాండ్లు సమంజసమని, అవి పరిష్కారం చేసే వరకూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమ్మె చేయడం ప్రజాస్వామిక హక్కని, హరించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ప్రస్తుత వేతనాలు ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా లేవన్నారు. కుటుంబాలను పోషించుకోలేకపోవడం వల్లే కార్మికుల్లో పట్టుదల పెరిగిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. వారి ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంటే వారికి వేతనాలు పెంచేందుకు డబ్బులు లేవని చెప్పడం ఏమాత్రమూ సరికాదని అన్నారు. ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టడం ఎలా అని ఆలోచించే ముఖ్యమంత్రికి చిరుద్యోగుల వేతనాల పెంపుపై పట్టుదలకు పోవడం ఏమిటని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకపోగా పోటీ కార్మికులను పెట్టి పనులు చేయిస్తూ కార్మికుల మధ్య ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇదే తీరుగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో వైసిపికి అధికారం పోవడం ఖాయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాబోయే రెండు, మూడు రోజుల్లో కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంఘీభావం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, దోనేపూడి కాశీనాథ్‌, నాయకులు తిరుపతమ్మ తదితరులు పాల్గన్నారు.

➡️