న్యాయం కోసమే నా పోరాటం

-నా వెనక రాష్ట్రమంతా ఉంది
-అవినాష్‌రెడ్డిని గెలవకుండా చేయడమే నా లక్ష్యం
-హంతకులు అధికారంలో ఉంటే న్యాయం జరగదు : సునీతా
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:హంతకులు, వారికి సహకరించేవారు అధికారంలో ఉంటే ప్రజలకు న్యాయం జరగదని వైఎస్‌ వివేకానంద కుమార్తె సునీతా అన్నారు. న్యాయం కోసం తనలా మరొకరు ఇబ్బందులు పడకూడదనే గత ఐదేళ్లుగా పోరాడుతున్నానని చెప్పారు. తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని, వైసిపి కార్యకర్తలతోసహా రాష్ట్రమంతా తనకు మద్దతుగా ఉందని అన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు ముందు, తర్వాత పరిస్థితులు వివరిస్తూ ‘జస్టిస్‌ ఫర్‌ వివేకా’ పేరుతో శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సునీత పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సిబిఐ, కోర్టులలో న్యాయం ఆలస్యం అవుతుందని, అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని చెప్పారు. అవినాష్‌రెడ్డి లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లరాదనేదే తన ధ్యేయం తెలిపారు. 2019 ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి పనిచేసినా రాజకీయ కుట్రలో భాగంగా ఎన్నికల్లో సానుభూతి కోసం హత్య చేశారని ఆరోపించారు. తన కుటుంబం అటువంటి పని చేయదని గుడ్డిగా నమ్మానని, వాస్తవాలు తెలిశాక వారిపై అసహ్యమేసిందని చెప్పారు. అవినాష్‌రెడ్డిని గెలవకుండా చూడడమే తన లక్ష్యమని, అందుకే ఎన్నికల వేళ ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి ఓడిపోయినా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, వివేకానందరెడ్డికి ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. జగన్‌ జైల్లో ఉన్నప్పుడు వైసిపిని అంతా తానై షర్మిల చూసుకుందని, మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసిన షర్మిలకు, వివేకానందరెడ్డికి జగన్‌ అన్యాయం చేశారన్నారు. వైఎస్‌ మరణానంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినందుకే జగన్‌, విజయమ్మ ఆ పార్టీకి రాజీనామా చేశారని విమర్శించారు.

➡️