నా అధికారం పేదలకు మేలు చేయడానికే : టీటీడీ చైర్మన్‌ భూమన

ప్రజాశక్తి-తిరుపతి : నా అధికారం పేదలకు మేలు చేయడానికేననీ, తాను కూడా ఎర్ర జెండా నీడన పెరిగిన వాడినేనని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. 38 నెలలపాటు నిరాహార దీక్షలు చేసిన తమ సమస్యలు పరిష్కరించి తాము కోరిన దానికన్నా ఎక్కువ జీతం పెంచిన భూమన కరుణాకర రెడ్డిని టీటీడీ అటవీ కార్మికులు మంగళవారం ఉదయం సన్మానించి కృత్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, కార్మిక, ఉద్యోగులందరూ సంతోషంగా ఉండాలనీ, బలహీనులకు న్యాయం జరగాలనే తాను టీటీడీలోని కాంట్రాక్ట్‌, కార్పొరేషన్‌, సొసైటీల్లో పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పారు. ఏ చిన్న అవకాశం ఉన్నా వారి కోరికలు నెరవేరుస్తున్నానని చెప్పారు . తాను కేవలం ఓట్లకోసం ఈ పనులు చేయడం లేదని, సామాన్యులకు మేలు చేయడమే నా సిద్ధాంతమని ఆయన చెప్పారు. పేద వారి కోసం నిస్వార్థంగా పోరాడే వారి మీద కూడా రాజకీయ బురద చల్లడం మంచిది కాదన్నారు. కమ్యూనిస్టులతో తనకు భావ స్వారూప్యం ఉన్నందు వల్లే కొన్ని అంశాల్లో వారితో కలసి పని చేస్తున్నామన్నారు. ఈ మాత్రానికే వారి మీద బురద చల్లడం మంచిది కాదన్నారు. తన దృష్టికి వచ్చిన టీటీడీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గోశాల కార్మికులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలపై అధికారులతో చర్చించి వీలైనన్ని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఇలాంటి రాతలకు భయపడం : సిపిఎం నాయకుడు కందారపు మురళి

స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్‌ అయ్యాకే ఉద్యోగ, కార్మిక సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని సిపిఎం నాయకుడు కందారపు మురళి చెప్పారు. 38 నెలలుగా నిరాహార దీక్షలు చేస్తున్న టీటీడీ అటవీ కార్మికుల టైమె స్కెల్‌ ఇతర సమస్యలు ఇక పరిష్కారం కావనుకున్న సమయంలో భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినరు రెడ్డి చొరవ వల్ల వారు అడిగిన దానికన్నా ఎక్కువ జీతం, సదుపాయాలూ లభించాయన్నారు. పారిశుధ్య కార్మికులు, పోటు కార్మికులు, కల్యాణ కట్ట క్షురకులు ఇలా అనేక మంది తరపున తాము పోరాటాలు చేస్తే కరుణాకర రెడ్డి వాటిని పరిష్కరించారన్నారు. మేలు చేసిన కరుణాకర రెడ్డికి కృత్ఞతలు చెప్పడం నేరమా? ఇది రాజకీయమా? మేము అధికార పక్షం అని వార్తలు రాస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తాము లెక్కలోకే తీసుకోమని, భయపడే ప్రసక్తి అసలే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, టీటీడీలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

➡️