జగన్‌ పాలనకు చరమగీతం 

Feb 18,2024 10:02 #Nara Lokesh
nara lokesh on ycp govt
  • శంఖారావం సభల్లో నారా లోకేష్‌

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని, త్వరలోనే ఆ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. విశాఖ జిల్లాలోని వేపగుంట, తగరపువలసలో, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శనివారం జరిగిన శంఖారావం సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌ నవరత్నాల పేరిట నవమోసాలు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి లబ్ధి అందుతుందని చెప్పి గెలిచాక మాటమార్చారన్నారు. 45 ఏళ్లు నిండిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ మహిళలకు పెన్షన్‌ ఇస్తానని నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. బిసిలకు సంక్షేమ పథకాల రద్దుతోపాటు పది శాతం రిజర్వేషన్లను రద్దు చేశారని, 27 వేల మందిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాడని విమర్శించారు. సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని నమ్మబలికి అధికారం దక్కించుకున్నాక నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని తెలిపారు. వైసిపి పాలనంతా భూకబ్జాల మయమైందన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించుకుని రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఆ పార్టీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. రౌడీయిజం, దౌర్జన్యాలతో రాష్ట్రం అతలాకుతమైందని విమర్శించారు. జగన్‌ పాలనతో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేస్తామని తెలిపారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని, తాడి గ్రామం తరలింపు, వేపగుంట రైతుల వుడా భూ సమస్య, సబ్బవరం-షీలానగర్‌ ఆరు లైన్ల రహదారి హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు పద్ధతులకు పాల్పడుతున్న, నిబంధనలను అతిక్రమిస్తున్న అధికారులందరి పేర్లూ రెడ్‌బుక్‌లో రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై జ్యుడీషియల్‌ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️